
తిరుమల, 2021, జులై 19: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం హోటళ్ల నిర్వాహకులు, ఆస్థానమండపంలో స్థానికులు, దుకాణాల వ్యాపారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హోటళ్ల నిర్వాహకుల సమావేశంలో అదనపు ఈవో మాట్లాడుతూ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన భోజనం అందించేందుకు తిరుమలలోని 15 ప్రాంతాల్లో లాభాపేక్ష లేకుండా హోటళ్లు నిర్వహించేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. అన్ని హోటళ్లలో ధరల పట్టికలు కనిపించేలా ఏర్పాటుచేయాలని, కంప్యూటరైజ్డ్ బిల్ ఇవ్వాలని, డిజిటల్ చెల్లింపులను అనుమతించాలని, పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండాలని సూచించారు. హోటళ్లు, దుకాణాల్లో అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. లీజు పొందినవారు సబ్లీజుకు ఇవ్వరాదన్నారు. సేకరణకు వీలుగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలన్నారు.
ఆస్థానమండపంలో అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలలోని దుకాణాలు, హాకర్ లైసెన్సులు, బాలాజినగర్లోని ఇళ్లను కొంతమంది అనధికారికంగా పొందినట్లు సమాచారం ఉందని, ప్రతి లైసెన్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి సక్రమంగా ఉన్నవారికి ఫొటో గుర్తింపుకార్డు మంజూరు చేస్తామన్నారు. స్థానికుల వివరాలన్నింటినీ కంప్యూటర్లో నమోదు చేస్తామని తెలిపారు. అలిపిరి చెక్‌పాయింట్ వద్ద భక్తులతో కలిసి చెక్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందని స్థానికులు విజ్ఞప్తి చేశారని, వీరికోసం ప్రత్యేక వరుస ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థానికులు పలు సమస్యలు తెలియజేశారని, తన పరిధిలో ఉన్నవాటిని వెంటనే పరిష్కరిస్తానని, మిగతా సమస్యలను ఈవో దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకెళతామని వివరించారు.
ఈ సమావేశాల్లో టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, డెప్యూటీ ఈవో విజయసారథి, విజివో బాలిరెడ్డి, హోటళ్ల నిర్వాహకులు, దుకాణాల వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు.
తిరుమలకు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి :
తిరుమల పవిత్రతను, స్వచ్ఛతను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని, భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకురావద్దని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలకు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు చేరకుండా అలిపిరి చెక్‌పాయింట్ వద్ద తనిఖీలు చేసి వాటిని తొలగిస్తామన్నారు. తిరుమలలోని దుకాణాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను విక్రయించకూడదన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా గాజు, కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్లు భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. 2 నెలల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి తిరుమల స్థానికులు, వ్యాపారులు సహకరించాలన్నారు. భక్తుల అవసరాల కోసం అన్ని కాటేజీల్లో జలప్రసాదం తాగునీరు, జగ్గులు, గ్లాసులు ఏర్పాటు చేశామన్నారు. సదరు జగ్గులు, గ్లాసులను ప్రతిరోజూ శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు.
ఈ సమావేశంలో టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, డెప్యూటీ ఈవోలు విజయసారథి, హరీంద్రనాథ్, లోకనాథం, భాస్కర్, ఇఇలు శ్రీహరి, మల్లికార్జునప్రసాద్, డిఇ శ్రీమతి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
కాటేజీలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు :
తిరుమలలోని కాటేజీలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతంలోని పలు కాటేజీలను సోమవారం అదనపు ఈవో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రతి కాటేజీలో చెక్‌లిస్టు రూపొందించాలని, తద్వారా యాత్రికులకు కేటాయించే సమయంలో సివిల్, ఎలక్ట్రికల్ వసతులతోపాటు పరిశుభ్రతాచర్యలు చక్కగా ఉండేలా చూడాలని సూచించారు. కాటేజీలకు వార్షిక నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుని ఎప్పటికప్పుడు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. గదుల్లో ఉన్న సోఫాలు, టీపాయ్‌లు, టాయ్లెట్లను పరిశీలించారు. స్నానపుగదుల్లో చక్కటి సువాసన వచ్చేలా, కాటేజీ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గదుల లోపల లీకేజీలను అరికట్టాలని, అక్కడక్కడ విరిగిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సుందరంగా ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలన్నారు.
అదనపు ఈవో వెంట టిటిడి వసతికల్పన విభాగం డెప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, డిఎఫ్వో చంద్రశేఖర్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇఇలు శ్రీహరి,మల్లికార్జునప్రసాద్ తదితరులు ఉన్నారు.