
శ్రీశైల దేవస్థానం: కార్తికమాస దర్శన, ఆర్జిత అభిషేకాల ఏర్పాట్లలో మార్పులు చేసామని ఈ ఓ లవన్న తెలిపారు. కార్తికమాస ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు (11.11.2021)న సమీక్ష సమావేశం జరిగింది.
కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో శ్రీ స్వామివారి ఆలయ ప్రధానార్చకులు, అన్ని విభాగాల యునిట్ అధికారులు, పర్యవేక్షకులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలు, పారిశుద్ధ్యం, కార్తిక సోమవారాలు, పౌర్ణమిరోజున లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తిక పౌర్ణమిరోజున జ్వాలాతోరణోత్సవం, నదీహారతి మొదలైన వాటికి సంబంధించి చర్చించారు.
గతంలో కార్తికమాసం అంతా కూడా స్వామివారి స్పర్శదర్శనం, స్వామివారి గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేయాలని నిర్ణయించారు.
అయితే ఈ సంవత్సరం సాధారణ రోజులలో రద్దీని దృష్టిలో ఉంచుకొని మరియు భక్తుల అభ్యర్ధనను పరిగణన లోకి తీసుకొని స్పర్శదర్శన మరియు గర్భాలయ అభిషేకాల నిర్వహణ సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ కార్తిక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆది,సోమవారాలు మరియు పౌర్ణమి, ఏకాదశి రోజులలో మినహా తక్కిన రోజులలో అనగా మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలలో శ్రీ స్వామివారి స్పర్శదర్శనానికి మరియు గర్భాలయ అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
రద్దీ సాధారణంగా ఉండే ఈ రోజులలో పరిమిత సంఖ్యలో అనగా రోజుకు కేవలం 50 ఆర్జిత గర్భాలయ అభిషేకాలు మాత్రమే జరుపుతారు.
ఈ 50 గర్భాలయ ఆర్జిత అభిషేకాలలో 25 టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతారు. తక్కిన 25 టికెట్లను భక్తులు కరెంటు బుకింగ్ ద్వారా పొందవచ్చు.
కాగా కరెంటు బుకింగ్ ద్వారా పొందిన గర్భాలయ అభిషేకాలను (25 అభిషేకాలు) ఉదయం వేళలలో చేస్తారు. ఆన్ లైన్ ద్వారా పొందిన గర్భాలయ ఆర్జిత అభిషేకాలను (25 అభిషేకాలు) మధ్యాహ్న వేళలలో ఉంటాయి.
గతంలో నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ సామూహిక అభిషేకాలను మూడు విడతలగానే చేస్తారు.. ఈ మూడు విడతలలో మొదటి విడత ఉదయం . గం.6.30లకు : రెండవ విడత గం.12.30లకు: మూడవ విడత సాయంత్రం గం.6.30లకు నిర్వహిస్తారు.