
శ్రీశైల దేవస్థానం:కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరఫున ఈ రోజు (16.09.2021)న ఉదయం పట్టువస్త్రాలు సమర్పించారు.
సెప్టెంబరు 10వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30వ తేదీతో ముగియనున్నాయి.
ఈ మేరకు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న దంపతులు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
దేవస్థానం పర్యవేక్షకులు స్వాములు, వేదపండితులు గంటి రాధకృష్ణమూర్తి, స్వామి అమ్మవార్ల అర్చకులు తదితరులు కాణిపాకం చేరుకుని దేవస్థానం తరుపున ఈ వస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణకు ముందుగా కాణిపాక దే స్థానం కార్యనిర్వహణాధికారి ఎ. వెంకటేష్, సహాయ కార్యనిర్వహణాధికారులు విద్యాసాగర్, కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, ఆలయ ఇన్ స్పెక్టర్ రమేష్, అర్చకులు,వేదపండితులు సాదరంగా ఈ దేవస్థాన అధికారులను ఆహ్వానించారు.
తరువాత సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, స్వామివారికి పూజాదికాలను జరిపించారు.
అనంతరం ఈ దేవస్థానం అధికారులను, అర్చకులను కాణిపాక కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశీర్వచనముతో సత్కరించారు.
ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిసంవత్సరం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సమయాన ఈ పట్టువస్త్రాలను సమర్పిస్తారు.