శ్రీశైల దేవస్థానం:శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలోని రామాలయములో శ్రీ సీతారామస్వామివార్ల కల్యాణమహోత్సవం జరిపించారు.
ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం సీతారాములవారికి, ఆంజనేయస్వామివారికి విశేష పూజాదికాలు జరిపించారు. ఉదయం సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు.
ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించారు. తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు.
అనంతరం వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవచనం జరిపారు.
ఆ తరువాత కంకణపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతపూజ, యజ్ఞోపవీతధారణ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, గౌరీపూజ, మాంగల్య పూజ, శ్రీసీతాదేవివారికి మాంగల్యధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సంప్రదాయ బద్దంగా సీతారామ కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
కల్యాణోత్సవంలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, సహాయ కార్యనిర్వహణాధికారి యం. హరిదాసు, అర్చక స్వాములు, వేదపండితులు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
