
శ్రీశైల దేవస్థానం:సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీపార్వతీ మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.
శ్రీశైలక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, ప్రతిరోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తుండగా , మకర సంక్రాంతి రోజున మాత్రం శ్రీ పార్వతీ మల్లికార్జునస్వామివార్ల లీలాకల్యాణోత్సవం విశేషం.
శ్రీస్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణమండపంలో ఎంతో వైభవంగా ఈ బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించారు.
కల్యాణోత్సవానికి ముందు అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని చెప్పారు. ఆదిదంపతులై, జగత్తుకంతా తల్లిదండ్రులైన శ్రీస్వామిఅమ్మవార్ల లీలా కల్యాణం వలన విశ్వశాంతి, లోక శ్రేయస్సుతో పాటు జనులందరికీ సకల శుభాలు కలగాలని ఈ సంకల్పంలో పేర్కొన్నారు.
సంకల్ప పఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
గణపతిపూజ తరువాత అభ్యుదయాన్ని, శుభాన్ని కాంక్షిస్తూ పుణ్యాహవచనం చేసారు. పుణ్యాహవచనం తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల వేంచేసిన సింహాసనానికి పూజాదికాలు జరిపారు.
తరువాత కల్యాణోత్సవంలో భాగంగా కంకణాలకు (రక్షబంధాలకు) పూజాదికాలు జరిగాయి. అనంతరం స్వామివారికి కంకణధారణ చేసారు.కంకణధారణ తరువాత స్వామివారికి యజ్ఞోపవీతధారణ చేసారు.
యజ్ఞోపవీతధారణ తరువాత అర్చకస్వాములు సప్తఋషుల ప్రార్ధనను చేసి కన్యావరణ మంత్రాలను చేసారు. పూర్వం శివపార్వతుల క ల్యాణ సమయములో స్వామివారికి తగిన వధువును వెదికే పనిని సప్తఋషులు నిర్వహించారు. అందుకు ప్రతీకగా ఆయా మంత్రాలతో ఏడుగురు అర్చక స్వాములు, వేదపండితులకు తాంబులాలు ఇచ్చారు. దీనికి కన్యావరణం అని పేరు.కన్యావరణం తరువాత అమ్మవారికి కంకణధారణ చేసారు.అనంతరం స్వామివార్ల ప్రవర పఠించారు. తరువాత స్వామివారికి నూతన వస్త్రాన్ని సమర్పించి వరపూజ చేసారు. తరువాత అమ్మవారి ప్రవర కూడా పఠించారు.
అనంతరం స్వామివార్లనుదుట బాసికాన్ని అలంకరింపజేచారు. అమ్మవారికి కూడా బాసికధారణ జరిపారు. బాసికధారణ తరువాత స్వామిఅమ్మవార్ల ఎదురుగా తెరవలే ఒక వస్త్రాన్ని కట్టారు. దీనిని తెరసెల్ల పట్టడం అంటారు. ఈ సమయంలో శ్రీశైల మహా సంకల్పం పఠించారు. శ్రీశైల సంకల్పంలో శ్రీశైలద్వార క్షేత్రాలు, ఉపద్వార క్షేత్రాలు, క్షేత్రంలోని వనాలు, తీర్థాలు, గుండాలు మొదలైన అంశాలు ప్రస్తావించారు.మహాసంకల్పం తరువాత అగ్నాపకాలుగా పేర్కొనే మంగళకరమైన ఎనిమిది శ్లోకాలు పఠించారు.అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు.
ఈ సమర్పణ తరువాత మాంగల్యపూజ జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ చేసారు. మాంగల్యధారణ తరువాత తలంబ్రాల కార్యక్రమం ఘనంగా జరిగింది.అనంతరం స్వామివారి ఉత్తరీయానికి, అమ్మవారి కొంగుతో బ్రహ్మముడి వేసి స్వామి అమ్మవార్లకు పునఃపూజ నిర్వహించారు.చివరగా భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు.
చెంచు భక్తులకు ప్రత్యేక ఆహ్వానం:
సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు భక్తులను ఆహ్వానించారు. స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) అధికారుల సహకారంతో చెంచు భక్తులు కల్యాణోత్సవానికి విచ్చేసే ఏర్పాట్లు చేసారు.
శ్రీశైల మహాక్షేత్రంలో గాఢమైన సంబంధం గల చెంచు భక్తుల సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి కల్యాణోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెంచులు శ్రీశైల భ్రమరాంబను తమ కూతురిగా శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. అదే విధంగా స్వామివారిని చెంచుమల్లన్న, చెంచుమల్లయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
ఈ సంవత్సరం కల్యాణోత్సవానికి విచ్చేసిన చెంచు భక్తులకు దేవస్థానం తరుపున వస్త్రాలు (పురుషులకు పంచ, కండువా, మహిళలకు చీర, రవిక వస్త్రం) కూడా అందించారు. కల్యాణోత్సవంలో చెంచు గిరిజనులు నూతన వస్త్రాలతో పాటు అడవి ఆకులతో అల్లిన అభరణాలను, శ్రీస్వామిఅమ్మవార్లకు సంప్రదాయబద్దంగా సమర్పించారు.
స్వామిఅమ్మవార్లకు ఈత ఆకులతో అల్లిన కంకణాలు, బాసికాలు, స్వామివారికి యజ్ఞోపవీతం, అమ్మవారికి వడ్డాణం, మెట్టెలు, ఇంకా మెడలో అలంకరించేందుకు ఆకులతో అల్లిన హారాలను కూడా సమర్పించారు..
కల్యాణ సమయం లో చెంచు భక్తులు సమర్పించిన వీటిని శ్రీస్వామిఅమ్మవార్లకు అలంకరింపజేశారు.
నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందిన పలు గూడెముల నుండి భక్తులు కల్యాణోత్సవానికి విచ్చేసారు.
చెంచుకుంట, చింతల, మోట్ల, తుమ్మలబయలు, మర్రిపాలెం మొదలైన గూడెముల నుంచి చెంచు భక్తులు విచ్చేశారు. వీరితో పాటు స్థానిక మేకలబండ, మాణిక్యమసెలకు చెందిన భక్తులు కూడా కల్యాణోత్సవం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేదపండితులు, దేవస్థానం సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి డా. డి. రవీంద్రారెడ్డి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి కె. లలిత, ఐ.టి.డి.ఏ సిబ్బంది పాల్గొన్నారు.