

శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవ రోజు బుధవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
ఉత్సవాలలో భాగంగానే యాగశాల లో శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించారు. అనంతరం లోకకల్యాణంకోసం జపాలు, పారాయణలు చేసారు.
తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపారు,
అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోషకాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిగాయి.
కైలాసవాహన సేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ జరిపారు .
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో కైలాసవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
తరువాత పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. గ్రామోత్సవములో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
గురువారం కార్యక్రమాలు:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 15న శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, చండీశ్వర పూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్టానాలు, రుద్రహోమం, సాయంకాలం నిత్య హవనాలు, బలిహరణలు మొదలైన కార్యక్రమాలు వుంటాయి..
ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ వుంటుంది.
ముగ్గుల పోటీలు:
సంక్రాంతి సందర్భముగా రేపు మహిళలకు ముగ్గులపోటీలు కూడా నిర్వహిస్తారు. ప్రధానాలయగోపురం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ పోటీలు నిర్వహిస్తారు.
సామూహిక భోగిపండ్ల:
భోగిపండుగను పురస్కరించుకుని ఈ రోజు (14.01.2026) దేవస్థానం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. చిన్న పిల్లలకు ఈ భోగింపండ్లు వేసారు.
స్థానికులతో పాటు పలు ప్రదేశాల నుంచి వచ్చిన యాత్రికుల చిన్నారులకు కూడా భోగిపండ్లను పోసారు.
ఈ భోగిపండ్ల కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, చిటిబొట్ల భరద్వాజశర్మ, దేవకి వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు ఎ. శ్రీనివాసులు, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు కె. శివప్రసాద్ స్వామి, స్థానాచార్యులు (అధ్యాపక), యం. పూర్ణానందరం, సహాయ కార్యనిర్వహణాధికారి కె. వెంకటేశ్వరరావు, పలువురు అర్చకస్వాములు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గొబ్బెమ్మలు, గొబ్బిపాటలు, హరిదాసులు, చలిమంటలు మొదలైన వేడుకలతో సంక్రాంతి పండుగ తెలుగు సంప్రదాయాలతో ఎంతగానో ముడిపడిఉందన్నారు. భోగినాడు ఆచరించే సంప్రదాయంలో చిన్నారులకు భోగిపండ్లను పోయడం అనేది ఒక ప్రధాన సంప్రదాయంగా వస్తోందన్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ఆలయప్రాంగణంలో జరుపుకుంటున్న ఈ చిన్నారులందరూ ఎంతో అదృష్టవంతులని తెలిపారు. చిన్నారులందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల కృపాకటాక్షాలు ఎల్లవేళలా లభిస్తుండాలన్నారు. చిన్నారులకు రేగుపండ్లు పోయడంలో పలు వైజ్ఞానిక అంశాలు కూడా యిమిడి ఉన్నాయన్నారు.
కాగా కార్యక్రమములో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు. తరువాత సంప్రదాయాన్ని అనుసరించి గణపతిపూజ జరిగింది.
అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు నిర్వహించారు. పూజాదికాల తరువాత రేగుపండ్లను, పూలరేకులతో కలిపి పిల్లలపై పోశారు.
ఈ భోగిపండ్లను వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెప్పబడుతోంది.
ఇంకా ఈ భోగింపడ్ల గురించి ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. తలపై భాగంలో బ్రహ్మరంద్రం ఉంటుంది. పిల్లలపై భోగిపండ్లను వేయడం వలన బ్రహ్మరంధ్రం ప్రేరేపించబడుతుందని, దాంతో మెదడు ఉత్తేజాన్ని పొంది పిల్లలలో జ్ఞానశక్తి పెరుగుతుందని కూడా చెబుతారు.
సంప్రదాయబద్దంగా భోగిమంటలు:
సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ రోజు వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, ప్రత్యేక ఆహ్వానితులు ఎ. శ్రీనివాసులు, శ్రీస్వామివారి ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, పలువురు అర్చకస్వాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈనాటి కార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్నికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.
అనంతరం సంప్రదాయబద్దంగా పిడకలు, ఎండుగడ్డి, వంటచెరుకుని వేసి “భోగిమంటలు” వేసారు.
సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతో ఏటా దేవస్థానం ఈ భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
జనవరి 15న బ్రహ్మోత్సవ కల్యాణం:
శ్రీశైలమహాక్షేత్రములో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18వతేదీతో ముగియనున్నాయి.
కాగా ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 15 న శ్రీస్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం జరుగుతుంది.
చెంచుభక్తులకు ప్రత్యేక ఆహ్వానం:
సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు భక్తులను ఆహ్వానించారు. స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) అధికారుల సహకారంతో చెంచుభక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించే ఏర్పాట్లు చేసారు.
శ్రీశైలమహాక్షేత్రంలో గాఢమైన సంబంధంగల చెంచు భక్తుల సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి కల్యాణోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
కాగా చెంచు భక్తులు శ్రీశైల భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. అదే విధంగా స్వామివారిని చెంచుమల్లన్న, చెంచుమల్లయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
కాగా కల్యాణోత్సవానికి విచ్చేసే చెంచు భక్తులకు దేవస్థానం తరుపున వస్త్రాలను (పురుషులకు పంచ, కండువా, మహిళలకు చీర, రవికవస్త్రం) కూడా అందిస్తున్నారు,

