
శ్రీశైలదేవస్థానం:కార్తికమాస శివదీక్షా విరమణ కార్యక్రమం ఈ రోజు (11.12.2021) ఉదయం ప్రారంభమైంది.
భక్తుల సౌకర్యార్థం ఐదు రోజుల పాటు, 15వ తేదీ వరకు ఈ దీక్షా విరమణలు కొనసాగుతాయి. దీక్షా విరమణ కోసం వివిధ ఏర్పాట్లు జరిగాయి.
కాగా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ దీక్షా విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దేవస్థానం తెలిపింది.
నవంబరు 5వ తేదీన శివమండల దీక్షను, నవంబరు 25వ తేదీన అర్థమండలదీక్షను స్వీకరించిన భక్తులు ఈ దీక్షా విరమణ సమయంలో దీక్షను విరమిస్తున్నారు.
ఈ దీక్షా విరమణను పురస్కరించుకుని ఈ రోజు (11.12.2021) ఉదయం స్వామివారి ఆలయ దక్షిణ ద్వారం వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి విశేష పూజలను నిర్వహించారు.
తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో రథవీధిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్ష శిబిరాలలో వేంచేబు చేయించారు.
అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారలతో పూజాదికాలు నిర్వహించారు. శివదీక్షా విరమణ కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకు కూడా శిబిరాలలోని దేవతామూర్తులకు ఉభయ సంధ్యలలో పూజాదికాలు చేస్తున్నారు.
అనంతరం దీక్షా శిబిరాలలోని హోమగుండానికి అర్చకస్వాములు పూజలను జరిపించి హోమాగ్నిని ప్రజ్వలింపజేశారు. తరువాత శివదీక్షాదారులు “ఓం నమశ్శివాయ ప్రణవ పంచాక్షరీనామస్మరణ”తో శివదీక్షా విరమణ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో దీక్షా విరమణ చేసే భక్తులంతా శ్రీ స్వామివారికి జ్యోతిర్ముడిని సమర్పిస్తున్నారు. జ్యోతిర్ముడి సమర్పణానంతరం ఆవునెయ్యి, నారికేళం మొదలుగాగల ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా భక్తులు సమర్పించారు.
కాగా శివదీక్షను స్వీకరించిన భక్తులకు నిర్ణీత వేళలో ప్రత్యేక దర్శనము క్యూ లైన్ ద్వారా స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. దీక్షా విరమణ చేసే భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు చేసారు. ఈ విషయమై దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. ఈ సిబ్బంది అంతా శివదీక్షా శిబిరాలలో నిరంతరం ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు.
కాగా మన పురాణాలలోను, వ్యవహారిక గాథల్లోనూ ఈ శివదీక్షా ప్రాశస్త్యం ఎంతగానో వివరించారు . చారిత్రకంగా కూడా ఈ శివదీక్షకు ఆధారాలు ఉండటం విశేషం. బాదామి చాళుక్య రాజైన రెండవ విక్రమాదిత్యుడు ఆంగ్లశకం 660 సంవత్సరంలో శివమండల దీక్షను స్వీకరించినట్లు గాను మరియు దీక్షను ఇచ్చిన శివగురువు సుదర్శనాచార్యునికి వంగూరు సీమలోని (నేటి జోగుళాంబా గద్వాల జిల్లా) ఇపరుంకల్ అనే గ్రామానికి గురుదక్షిణగా ఇచ్చినట్లుగాను, అలంపూరు మండంలోని ఆముదాలపాడులో లభించిన విక్రమాదిత్యుని తామ్రశాసనం చెబుతోంది.