దుష్ట శక్తుల సంహారి కాళరాత్రి దేవి
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా ఏడవ రోజైన ఈ రోజు (13.10.2021) ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్యనమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిగాయి.
శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు నిర్వహించారు.
అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం ప్రత్యేకం.
ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రి పూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు ప్రత్యేకం.
కుమారి పూజ:
దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతోంది. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
కాళరాత్రి అలంకారం:
ఈ నవరాత్రి మహోత్సవాలలో, నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని కాళరాత్రి స్వరూపంలో అలంకరింపజేయడం ప్రత్యేకం.
నవదుర్గ స్వరూపాలలో ఏడవ రూపం ఈ కాళరాత్రి. ఈ దేవి నల్లటి దేహఛాయతో జుట్టు విరియబోసుకొని పెడబొబ్బ నవ్వులతో రౌద్రరూపములో ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయహస్తం, వరద ముద్రను, ఎడమవైపు ఖడ్గము, లోహకంటకాన్ని ధరించి ఉంటుంది. కాళరాత్రి స్వరూపం చూడటానికి రౌద్రంగా ఉన్నప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ఇస్తుంది. అందుకే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
దసరా మహోత్సవాలలో ఏడవనాడు కాళరాత్రి దేవిని పూజించాలని చెప్పబడింది. కాళరాత్రి దేవి దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. ఈ దేవిని కేవలం స్మరించనంత మాత్రమే భూత, ప్రేత, పిశాచాదులు భయపడి పారిపోతాయని, ఈ దేవిని ఆరాధించడం వలన భయాలనేవేవి ఉండవని, సర్వదా సాధకుడు భయదూరుడవుతాడని భక్తుల విశ్వాసం.
గజవాహనసేవ:
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు గజవాహనసేవ ప్రత్యేకం.
ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, గజవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు ప్రత్యేకం.
14న రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాల సమర్పణ:
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని రేపు (14.10.2021) సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
ఈ కార్యక్రమములో స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా పాల్గొననున్నారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజాదికాలు చేస్తారు . తరువాత మేళతాళాలతో మంత్రి ఆలయ ప్రవేశంచేసి వేదపండితులు, అర్చకస్వాముల మంత్రోచ్ఛరణలతో వస్త్ర సమర్పణను చేస్తారు.
ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైల క్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి. ఈ సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోను, దసరా మహోత్సవాలలోను పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.
పట్టువస్త్రాలను సమర్పించిన కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న:
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి మొదలైన దసరా మహోత్సవాలు తొమ్మిది రోజులపాటు జరిగి ఈ నెల 15వ తేదీతో ముగియనున్నాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా ఈరోజు (13.10.2021) సాయంకాలం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
వారు వ్యక్తిగతంగా ఈ పట్టువస్త్రాలను సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను, ఫలపుష్పాదులను కార్యనిర్వహణాధికారి శ్రీస్వామి అమ్మవార్లకు సమర్పించారు.
ఈ కార్యక్రమములో స్వామివారి ప్రధానార్చకులు జె.భద్రయ్యస్వామి, వేదపండితులు గంటి రాధకృష్ణశర్మ అవధాని, ఆలయసహాయకార్యనిర్వహణాధికారి ఎం.హరిదాసు తదితరులు పాల్గొన్నారు.
భద్రతా సిబ్బందికి సూచనలు:
ఈ రోజు (13.10.2021) స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ సమావేశములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి, ముఖ్య భద్రతా అధికారి, సంబంధిత భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రాన్ని ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో భక్తులు సందర్శించడం జరుగుతోందని, అందుకే క్షేత్ర భద్రత అనేది ఎంతో ప్రాముఖ్యత గల అంశమన్నారు. ఈ కారణముగా భద్రతా సిబ్బంది విధినిర్వహణ సమయములో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతా సిబ్బంది వారికి నిర్దేశించిన ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్నప్పుడు భక్తులతో పూర్తి మర్యాదగామెలగాలన్నారు. క్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడంలో కూడా భద్రతా సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. టోల్ గేట్ వద్ద కూడా పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు. క్షేత్రపరిధిలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించడం పట్ల భద్రతా సిబ్బంది పూర్తి శ్రద్ధ కనబర్చాలన్నారు.
తరువాత కార్యనిర్వహణాధికారి లవన్న ప్రసంగిస్తూ ఆలయములో దర్శనం క్యూలైన్ల నిర్వహణ, రద్దీక్రమబద్ధీకరణ, వాహనాలు రాకపోకల క్రమబద్దీకరణ, వాహన పార్కింగ్ ప్రదేశాలు మొదలైనచోట్ల భద్రతా సిబ్బంది ఎంతో జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు.
భద్రతా సిబ్బంది వారివారి విధులలో ఉన్నప్పుడు భక్తులు అడిగే సాధారణ సమాచారాన్ని కూడా అందించాలన్నారు. భక్తుల మనోభావాలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాల్సిన అంశంపైన కూడా భద్రతా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.
*Jwala Veerabhadra Swamy Pooja performed in the temple .
*Devi Mahathyam (Pravachanam) by Iruvanti Shravan Kumar Sharma, Devi Bhagavatam (Pravachanam) by M. Vishwanath Sharma attracted the devotees.*Sampradaya Nruthyam Programme ( Smt G. Vijaya Gouri) and other programmes attracted the audience.
Post Comment