
తిరుపతి, 2021 నవంబరు 09: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్నందున, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై జెఈవో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ పురావస్తు శాఖ అధికారుల అనుమతి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పోటు, యాగశాల, కల్యాణమండపం విస్తరణ, గోవును ఉంచేందుకు షెడ్డు, సెక్యూరిటీ పాయింట్, లడ్డూ కౌంటర్లు తదితరాలను ఆలయంలో ఏర్పాటు చేసేందుకు 10 రోజుల్లోపు ప్రతిపాదనలు పంపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయం వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశంలో కల్యాణకట్ట ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. శ్రీవారి మెట్టు మార్గంలో టిటిడి కల్యాణమండపం పక్కన ప్రస్తుతం నిర్వహిస్తున్న కల్యాణకట్టలో భక్తుల సౌకర్యాలను తనిఖీ చేశారు. అనంతరం శ్రీవారి ఆలయాన్ని దర్శించుకుని శ్రీకృష్ణదేవరాయసదన్లోని గదులను పరిశీలించారు. అక్కడి ప్రథమ చికిత్సా కేంద్రంలో భక్తులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీ పద్మావతి అమ్మవారిని కల్యాణం చేసుకుని శ్రీనివాసమంగాపురంలో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ ఆలయానికి ఇంతటి విశిష్టత ఉందని, వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ, యువకులు ఇక్కడ కంకణం కట్టుకోవడం ద్వారా వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసమని చెప్పారు. ఇటీవల ప్రారంభించిన గోపూజకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని, నూతనంగా ప్రారంభించిన కల్యాణకట్టలో భక్తులు విరివిగా తలనీలాలు సమర్పిస్తున్నారని చెప్పారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.
ఈ సమావేశంలో పురావస్తు శాఖ అధికారి సత్యం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇఇ మురళి, డెప్యూటీ ఇఇ నాగభూషణం, ఏఈవో ధనంజయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.