- సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు.. అంతా ఒకే గొడుగు కిందకు
- ఒకే క్లిక్‌తో సమస్త భూ సమాచారం
- ప్రతి సర్వేనెంబర్‌కు భూధార్ నెంబర్
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ మార్చి 26 : తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని, రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ( ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజిమెంట్ సిస్టమ్) ను ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ , ఎన్ఐసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా భూపరిపాలన సేవలను మరింత వేగవంతంగా అందించడానికి రెవెన్యూ. స్టాంప్స్& రిజిస్ట్రేషన్ , సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ది చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి భూలావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా ఈ పోర్టల్‌ను రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చేనెల 2వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్ లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు చేర్పులు చేసి రెండవ దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని తెలిపారు.
