
శ్రీశైల దేవస్థానం:అక్టోబరు 26 నుంచి నవంబరు 23 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్న సందర్భంగా
భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న పాతాళగంగ, శివగంగ జలప్రసాద ప్లాంట్లను , మల్లమ్మ కన్నీరు తదితర ప్రదేశాలను పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కార్తీకమాసంలో భక్తులు అధికసంఖ్యలో పాతాళగంగలో పుణ్యస్నానాలాచరిస్తారని అన్నారు. పాతాళగంగ పరిసరాలను, పాతాళగంగ మెట్లను, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తుండాలని పారిశుద్ధ్య విభాగపు అధికారులను ఆదేశించారు. కార్తీకమాసంలో సిబ్బందిని పెంచి జనరల్ షిఫ్టును కూడా పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పాతాళగంగలో ప్రమాదాలు జరగకుండా వుండేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.పాతాళగంగలో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా దేవస్థానం ఈత నిపుణులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న ఈత నిపుణలతో పాటు కార్తీక మాసములో మరికొంత మందిని అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పాతాళగంగ పరిసరాలలో, మెట్ల వెంబడి మరిన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేసి విద్యుద్దీకరణను పెంచాలని కూడా ఇంజనీరింగ్ అధికారులను ఈ ఓ ఆదేశించారు.శౌచాలయాలను నిరంతరం పరిశుభ్రంగా ఉండే విధంగా శ్రద్ధ చూపాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. భక్తులకు సమాచారం తెలిసే విధంగా పాతాళగంగలో సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు.
శివగంగా జలప్రసాద ప్లాంట్ల పరిశీలన :
పాతాళగంగ పరిశీలన అనంతరం దేవస్థానం నిర్వహిస్తున్న శివగంగా జలప్రసాద ( మినిరల్ వాటర్ ప్లాంట్లను) ప్లాంట్లను ఈ ఓ పరిశీలించారు.దేవస్థానం పరిధిలో మల్లికార్జునసదనం, గంగా – గౌరీ సదన్, శివదీక్షా శిబిరాలు, కల్యాణకట్ట, ఘంటామఠం, మల్లమ్మకన్నీరు, జిల్లా పరిషత్ అతిథిగృహం, జగద్గురుమఠం, దేవస్థానం వైద్యశాల, దేవస్థానం అన్నప్రసాద వితరణ, టూరిస్ట్ బస్టాండ్ తదితర చోట్ల ఏర్పాటు చేసిన ప్లాంట్లను కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.
ఆయా ప్లాంట్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలని, భక్తులందరికీ శుద్ధజలం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. శుద్ధజల ప్లాంట్లలో ఎలక్ట్రికల్ వైరింగ్ , అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ల వద్ద నీరు వృథా కాకుండా పైపులన్నింటికి ట్యాపులు బిగించాలని ఆదేశించారు. ఆయా ప్లాంట్ల వద్ద ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.అనంతరం హేమారెడ్డి మల్లమ్మ ఆలయం వద్ద ఫ్లోరింగ్ పనులను పరిశీలిస్తూ పనులన్ని నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని అన్నారు.త్వరగా ఈ పనులన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. పరిశీలనలో దేవస్థాన ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి.
రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పారిశుద్ధ్య విభాగపు పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఐ(సి) చంద్రశేఖరశాస్త్రి, ముఖ్య భద్రతా అధికారి నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు రాజేశ్వరరావు, రంగరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.