కోవిడ్ నివారణ నిబంధనల అమలులో రాజీపడకూడదు-ఈ ఓ
శ్రీశైల దేవస్థానం:ఇటీవల కాలంలో సామూహిక అభిషేకాలు,గర్బాలయ అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు, కల్యాణోత్సవం మొదలైన ఆర్జితసేవాకర్తల ప్రవేశ మార్గాన్ని విరాళాల సేకరణకు ఎదురుగా గల ఆలయ ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసారు.
గతం లో హరిహరరాయగోపురం ద్వారం అయిన గేట్ నెం.2 ద్వారా ఆర్జితసేవాకర్తలను అనుమతించేవారు.
అయితే ప్రస్తుతం హరిహరరాయగోపురం ద్వారా ( గేట్ నెం.2) ప్రవేశాలు నిలుపుదల చేసి విరాళాల సేకరణ కేంద్రం ఎదురుగా గల ఆలయ ప్రధానగేటు ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు. ఈ గేటు వద్ద నుంచి ప్రాకార కుడ్యం ప్రక్కగా గల అదనపు క్యూలైన్ల ద్వారా ఆర్జితసేవాకర్తలను అనుమతిస్తున్నారు.
కాగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఈ రోజు (25.09.2021) న ఈ ఆర్జితసేవా క్యూలైన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్జితసేవా క్యూలైన్లగా వినియోగిస్తున్న అదనపు క్యూలైన్ల పై భాగంలో కూడా రేకులతో పై కప్పు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. దీనివలన భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
అదేవిధంగా దర్శనాలకు విచ్చేసే భక్తులను , ఆర్జిత సేవాకర్తలను ఆలయం లోనికి అనుమతించేటప్పుడు కోవిడ్ నివారణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఓ సూచించారు. ఈ విషయమై ఏవిధంగా కూడా రాజీపడకూడదన్నారు.దర్శనానికై క్యూకాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు సమయానుకూలంగా మంచినీరు, అల్పాహారాలను అందిస్తుండాలన్ని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా (మైక్ ద్వారా) ఎప్పటికప్పుడు ఆలయవేళలు, ఆయా టికెట్లు ఇచ్చే సమయం, ఆయా దర్శనాలకు పట్టే సమయం తదితర అంశాలను తెలియజేస్తుండాలన్నారు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా భక్తులు భౌతికదూరాన్ని పాటించేవిధంగా వారిలో అవగాహన కల్పించాలన్నారు.
ఆర్జిత సేవలను నిర్వహించేటప్పుడు కూడా సేవాకర్తలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించే విధంగా సంబంధిత సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.భక్తులు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడంలాంటి నియమాలను విధిగా ఆచరించేలాగా చర్యలు చేపట్టాలన్నారు.
సెల్‌ఫోన్లు మొదలైనవాటిని ఎట్టిపరిస్థితులలోనూ ఆలయములోకి అనుమతించకూడదని కూడా ముఖ్య భద్రతాధికారిని ఆదేశించారు. ఎవరైనా భక్తులు ప్రవేశద్వారం వద్ద సెల్ ఫోన్లతో వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా వారికి ఆలయ నిభందనలను తెలియజెప్పి, సెల్ ఫోన్లను ఆలయం వెలుపల భద్రపరుచుకోవలసినదిగా సూచించాలన్నారు. ఆలయములోనికి బ్యాగులను అనుమతించకూడదని ఆదేశించారు. ఎవరైనా బ్యాగులను కలిగివుంటే ప్రవేశద్వారంవద్దనే వాటిని నిలుపుదల చేయాలన్నారు.
ఈ పరిశీలనలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాస్, శ్రీశైల ప్రభ ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ , ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, ముఖ్యభద్రత అధికారి నరసింహరెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Post Comment