×

పాతాళగంగలో ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి-ఈ ఓ లవన్న

పాతాళగంగలో ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి-ఈ ఓ లవన్న

 శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలన లో భాగంగా ఈ రోజు (29.09.2021) న పాతాళగంగ స్నానఘట్టాలను కార్యనిర్వహణాధికారి  ఎస్.లవన్న ఆకస్మికంగా తనిఖీ చేసారు.

ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ ముఖ్యంగా పాతాళగంగలో ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు పటిష్టమైన బ్యారికేడింగ్ లాంటి రక్షణ చర్యలను మరింతగా చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాతాళగంగ స్నానఘట్టాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, ఆ ప్రాంతాన్నంతా పరిశుభ్రంగా ఉంచేవిధంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా పాతాళగంగలోని  (మరుగుదొడ్లు) శుభ్రతపై ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు.

పాతాళగంగలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని దేవస్థానం ఏర్పాటుచేసిన ఈత  నిపుణులను  ఆదేశించారు.

దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలలో పాతాళగంగ ప్రాంతాన్ని నిరంతరం పరిశీలిస్తూ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేస్తుండాలని సీసీ కంట్రోల్ విభాగాన్ని ఆదేశించారు.పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు.

రాబోయే కార్తికమాసములో అధిక సంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్న కారణంగా మరిన్ని మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత మేరకు పాతాళగంగలో ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలన్నారు.

 పాతాళగంగ తీరములో (పాతమెట్లమార్గం వైపు) గల విశాలమైన బయలుప్రదేశములో పూలమొక్కలు, సుందరీకరణ మొక్కలు మొదలైనవాటితో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.

 పాతాళగంగ వద్ద చిరువ్యాపారులు చేస్తున్న వారితో సంభాషిస్తూ ప్రతి ఒక్కరు కూడా విధిగా చెత్తబుట్టను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెత్త చెదారాలను చెత్తబుట్టలోనే వేస్తుండాలని, ప్రతీరోజు కూడా దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బంది వాటిని సేకరించడం జరుగుతోందన్నారు. చెత్తబుట్టలను వినియోగించడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వ్యాపారులకు తెలియజెప్పారు.

ఈ కార్యక్రమంలో పారిశుద్యపు విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు బి.శ్రీనివాసరెడ్డి, నీటిసరఫరా విభాగపు సహాయ ఇంజనీర్ రాజేశ్వరరావు, దేవస్థానం ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్  తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed