
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్ర అభివృద్ధి పనులలో భాగంగా దేవస్థానం చేపట్టిన పంచమఠాల పునర్నిర్మాణ పనులను ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఘంటామఠం, రుద్రాక్ష మఠం, విభూతిమఠం పనులను చక్రపాణి పరిశీలించారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టారు.
పంచమఠాలలో విభూతిమఠ, రుద్రాక్షమఠ పునర్నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఈ మఠాలలో నూతనంగా ద్వారబంధనాలను, ద్వారాలను ఏర్పాటు చేయవలసివుంది.
ఘంటామఠంలో ప్రధానాలయ పనులు పూర్తి అయ్యాయి. ఘంటామఠ ప్రాంగణములోని నాలుగు ఉపాలయాల పనులు కూడా పూర్తి అయ్యాయి.ఘంటామఠంలో ఇంకా ఫ్లోరింగ్ పనులను చేపట్టవలసివుంది.నిర్మాణపరంగా బాగానే వున్న భీమశంకరమఠానికి కూడా తగు మరమ్మతులు చేస్తున్నారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ మిగిలివున్న పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.అన్ని మఠాల ప్రాంగణాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు పచ్చదనాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.భక్తులు ఆయా మఠాలను దర్శించేందుకు వీలుగా తగు ప్రచారాన్ని కల్పించాలని శ్రీశైలప్రభ విభాగానికి సూచించారు.
ఈ పరిశీలనలో సహాయ కమిషనర్ (ఐసి) , సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం.నరసింహారెడ్డి, సహాయ స్థపతి ఐ. ఉమా వెంకట హరిజవహర్ లాల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె. సురేష్ కుమార్ రెడ్డి, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.