×

పంచమఠాల పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రతి మఠం చుట్టూ ఐరన్‌మెష్-ఈ ఓ

పంచమఠాల పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రతి మఠం చుట్టూ ఐరన్‌మెష్-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: పంచమఠాల పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రతి మఠం చుట్టూ ధృఢమైన కంచె ( ఐరన్‌మెష్) ఏర్పాటు చేయాలని ఈ ఓ  ఎస్.లవన్న ఆదేశించారు. అభివృద్ధి పనులలో భాగంగా దేవస్థానం చేపట్టిన పంచమఠాల పునర్నిర్మాణ పనులను ఈ రోజు (30.12.2021) కార్యనిర్వహణాధికారి  ఎస్.లవన్న పరిశీలించారు.

ఈ పరిశీలనలో ఘంటామఠం, రుద్రాక్ష మఠం, విభూతిమఠం పనులను కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.

కాగా ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టబడ్డాయి. ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులు చేయబడుతున్నాయి.

కాగా పంచమఠాలలో విభూతిమఠ, రుద్రాక్షమఠ పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ మఠాలలో నూతనంగా ద్వారబంధనాలను, ద్వారాలను ఏర్పాటు చేయవలసివుంది.

ఘంటామఠంలో ప్రధానాలయ పనులు పూర్తి అయ్యాయి. ఘంటామఠ ప్రాంగణములోని మూడు ఉపాలయాల పనులు కూడా పూర్తి అయ్యాయి. మరో ఉపాలయ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల తర్వాత బండపరుపు పనులను చేపట్టవలసివుంది.

కాగా నిర్మాణ పరంగా బాగానే వున్న భీమశంకర మఠానికి కూడా తగు మరమ్మతులు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ఈ పునర్నిర్మాణ పనులలో పూర్తి నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.  పనులు త్వరలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పంచమఠాల పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రతి మఠం చుట్టూ ధృఢమైన కంచె ( ఐరన్‌మెష్) ఏర్పాటు చేయాలన్నారు.

అన్ని మఠాల   ప్రాంగణాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు పచ్చదనాన్ని ( ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్) అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా మఠాల ప్రాంగణాలలో బిల్వం, కదంబం లాంటి దేవతా వృక్షాలను నాటాలన్నారు.

పంచమఠాల పునర్నిర్మాణం పూర్తయిన వెంటనే భక్తులు ఈ మఠాలన్నింటికి ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్ని మఠాలను కలుపుతూ (ఒకే సర్కూట్ గా) ఏక రహదారిని నిర్మించే పనులు ప్రారంభించాలన్నారు

అదేవిధంగా విభూతిమఠం ముందుభాగంలో గల ప్రాచీన మెట్ల మార్గానికి కూడా తగు మరమ్మతులు చేపట్టి, ఆ మార్గాన్ని పునరుద్ధరించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

యాంఫీథియేటర్ పనుల పరిశీలన

పంచమఠాల పరిశీలన తరువాత కార్యనిర్వహణాధికారి  యాంఫీథియేటర్ (ప్రదర్శనశాల) పనులను కూడా పరిశీలించారు.

భారత ప్రభుత్వపు “ప్రసాద్” (PRASAD – Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకం కింద గోశాల సమీపములో (వలయ రహదారి ప్రక్కలో) ఈ ప్రదర్శనశాలను  నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణములో ప్రధాన పనులన్నీ పూర్తి చేసారు.

ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, సహాయ స్థపతి ఐ.ఉమావెంకటజవహర్లాల్ తదితర ఇంజనీరింగ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed