గోశాలలో శుచిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి-ఎస్.లవన్న

శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ రోజు (29.08.2021) న  కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న  దేవస్థాన గోసంరక్షణశాలను,  విభూతి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా ప్రసాద్ పథకం కింద నిర్మిస్తున్న యాంఫీ థియేటర్ పనులను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ గోశాలలో శుచిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు గోశాల శుభ్రపరిచేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాలలో పవిత్రవాతావరణం కల్పించాలని, దీనివలన అక్కడ మరింత ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందుతుందన్నారు.గోశాలలోని గోవులకు తగినంత మేత, తాగునీరు అందించడములో ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు.

 గోవులన్నింటికీ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. గోశాలలో బలహీనపడిన గోవులు మరియు జబ్బుపడే గోవుల పట్ల కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

గోవులలో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటికి కాలానుగుణంగా టీకా మందులను వేయించాలని ఆదేశించారు. గోవు సంరక్షణకు అవసరమైన ఔషధాలన్నింటిని సిద్ధంగా వుంచుకోవాలన్నారు.పశు ఔషధాల ప్రస్తుత స్టాకును పరిశీలించారు. అవసరమైతే మరిన్ని ఔషధాలను కొనుగోలు చేయాలని కూడా కార్యనిర్వహణాధికారి  ఆదేసహించారు. అదేవిధంగా గోవులకు సంబంధించిన ఔషధాలను దాతల నుంచి కూడా సమకూర్చుకోవచ్చునని అన్నారు.

తరువాత విభూతి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. విభూతి తయారీలో సంప్రదాయ పద్ధతులను, పూర్తి నాణ్యతను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆలయాన్ని సందర్శించే భక్తులరద్దీకనుగుణంగా తగినంత విభూతి స్టాకును సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

యాంఫీ థియేటర్ పరిశీలన ఈరోజు (29.08.2021) కార్యనిర్వహణాధికారివారు యాంఫీథియేటర్ (ప్రదర్శనశాల) పనులను కూడా పరిశీలించారు.భారత ప్రభుత్వపు “ప్రసాద్” (PRASAD – Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive ) పథకం కింద గోశాల సమీపములో (వలయ రహదారి ప్రక్కలో) ఈ ప్రదర్శనశాల నిర్మించబడుతోంది. ఇప్పటికే దాదాపు 90శాతానికి పైగా ఈ నిర్మాణపు పనులు పూర్తిఅయ్యాయి.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ యాంఫీ థియేటర్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు వీలుగా మిగిలిన కొద్దిపాటి పనులను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

print

Post Comment

You May Have Missed