శ్రీశైల దేవస్థానం:ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం పంచమఠాల పునర్నిర్మాణ పనులు కొనసాగిస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఘంటామఠ పనులను పరిశీలించారు.ఇప్పటికే ప్రధానాలయానికి సంబంధించి గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమానగోపుర నిర్మాణాలు పూర్తి చేసారు. ఘంటామఠ ప్రాంగణములోని ఉపాలయాలు కూడా పూర్తి చేసారు.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డివారిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ ఇంకనూ పూర్తి కావాలసివున్న బండపరుపు పనులను (ఫ్లోరింగ్) వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎటువంటి ఆలస్యం లేకుండా పనులన్నింటిని కొనసాగించాలన్నారు. ఆయా మఠాల ప్రాశస్త్యం తెలిసేవిధంగా అన్నిచోట్ల కూడా బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. మఠాల ప్రాంగణాలు, పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న మాట్లాడుతూ ఘంటామఠంతో పాటు పునరుద్ధరించబడిన విభూతి, రుద్రాక్ష మఠాల చుట్టూ ధృఢమైన ఐరన్ గ్రిల్స్ తో కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భీమశంకరమఠం చుట్టూ కూడా గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా మఠాల ప్రాంగణాల చుట్టూ పచ్చదనాన్ని ( ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్) అభివృద్ధి చేయాలన్నారు. మఠాల ప్రాంగణాలలో బిల్వం, కదంబం లాంటి దేవతా వృక్షాలను నాటాలన్నారు. భక్తులందరు ఈ మఠాలన్నింటికి ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్ని మఠాలను కలుపుతూ (ఒకే సర్కూట్ గా) ఏక రహదారిని నిర్మించే పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ వి.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్, సహాయ ఇంజనీర్లు భవన్ కుమార్, సీతారమేష్, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.