ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి శాస్త్రోక్తంగా లక్ష దీపోత్సవం, దశవిధ హారతుల కార్యక్రమాన్ని నిర్వహించాలి

 శ్రీశైలదేవస్థానం: ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి శాస్త్రోక్తంగా లక్ష దీపోత్సవం, దశవిధ హారతుల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ ఓ ఎస్.లవన్న ఆదేశించారు. ఈ నెల 5వ తేదీ నుండి డిసెంబర్ 4 వ తేదీ వరకు కార్తిక మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్తిక మాసం లో సోమవారాలు,  పౌర్ణమి రోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,  పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ పుష్కరిణి హారతిలో దశవిధ హారతులు , ఓంకార హారతి, నాగ హారతి, త్రిశూల హారతి, నంది హారతి, సింహ హారతి, సూర్య హారతి, చంద్ర హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.

 ఈ రోజు (01.11.2021)న  కార్యనిర్వహణాధికారి ఎస్ .లవన్న  సంబంధిత అధికారులతో కలిసి పుష్కరిణి ప్రాంతాన్ని సందర్శించి ఆయా ఏర్పాట్లను గురించి తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా  కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ లక్షదీపోత్సవం, దశవిధ హారతుల కార్యక్రమాన్ని శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యంగా జరుపుతారు కనుక ఎలాంటిలోపాలు లేకుండా పూర్తి శాస్త్రోక్తంగా  ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో పుష్కరిణి వద్ద శ్రీస్వామిఅమ్మవార్లను వేంచేబు చేయించి పూజాదికాలు జరిపేందుకు వేదికను విశాలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.లక్షదీపోత్సవ నిర్వహణకు వీలుగా పుష్కరిణి పరిసరాలలో ఏర్పాటు చేసే ప్రమిదలను క్రమపద్ధతిగా ఏర్పాటు చేయించాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.

 కార్యక్రమాల రోజులలో పుష్కరిణి ప్రాంగణములో విద్యుద్దీపాలంకరణ చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఈ ఓ  ఆదేశించారు.భక్తులు కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు వీలుగా పుష్కరిణి వద్ద తగు లైటింగ్ ఏర్పాటు చేయాలని కూడా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.కార్యక్రమాల రోజున సంప్రదాయబద్ధంగా పుష్కరిణి వద్ద పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పుష్కరిణి పరిసరాలను శుభ్రపరిచే ఏర్పాటు చేయవలసినదిగా పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.

భక్తులకు లక్షదీపోత్సవ , పుష్కరిణి హారతి ప్రాశస్త్యం తెలియజెప్పేందుకు ప్రముఖులచేత ప్రవచనాలు,  ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల విభాగాన్ని ఈ ఓ  ఆదేశించారు.కార్యక్రమం గురించి భక్తులకు తెలిసేందుకు వీలుగా తగు ప్రచారాన్ని చేయడంతో పాటు క్షేత్రపరిధిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ సంపాదకుడిని ఆదేశించారు.

కార్తిక దీపారాధన ఏర్పాట్లు:

ఈ సంవత్సరం ఆలయ ఉత్తర మాడవీధిలో (శివవీధిలో) భక్తులు దీపాలను వెలిగించేదుకు వీలుగా ఆయా ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా కార్యనిర్వహణాధికారి ఉత్తర మాడవీధిని పరిశీలించారు.భక్తులు పుజాదికలు జరిపించేదుకు వీలుగా ఉత్తరమాడవీధిలో చెట్ల కుండీలలో ఉసిరి మొక్కలను ఏర్పాటుచేయాలని  ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.

ఈ పరిశీలనలో, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి యం. హరిదాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు, స్వాములు, ముఖ్యభద్రతదికారి నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు రాజేశ్వరరావు, విష్ణు, సురేష్ రెడ్డి, ఉద్యానవన అధికారి శ్రీ లోకేష్, అసిస్టెంట్ స్థపతి ఉమా వెంకటజవహర్ తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed