
శ్రీశైల దేవస్థానం: కార్యనిర్వహణాధికారి లవన్న గురువారం అన్నప్రసాద వితరణను పరిశీలించారు. ఈ పరిశీలనలో అన్నప్రసాద వితరణ భవనంలోని వంటశాల, కూరగాయలు నిల్వ ఉంచు గది, అన్నప్రసాద వితరణజరిగే హాళ్ళు, స్టోరు మొదలైనవాటిని పరిశీలించారు.ముందుగా అన్నప్రసాద వితరణను స్వయంగా పరిశీలించారు.ఈ రోజు 5న వండిన వంటకాలను పరిశీలించారు. ఈ ఓ మాట్లాడుతూ అన్నప్రసాద వితరణకు గాను రోజువారి వంటకాల తయారీ జాబితాను (మెనూను) ముందస్తుగా రూపొందించుకుని తదనుగుణంగా వంటకాలను తయారు చేస్తుండాలని పర్యవేక్షకురాలు దేవికను ఆదేశించారు. వంటకాలలో కూరగాయలను విరివిగా వాడాలన్నారు.ముఖ్యంగా కూరగాయలు తాజగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఆయావంటకాలన్నీ రుచికరంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టుతుండాలన్నారు. అన్నప్రసాదవితరణలో వండిన ప్రతీ వంటకం కూడా ప్రతి భక్తుడికి అందేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు.
సాయంకాలం వితరణ చేసే అల్పాహారంలో సమయానుకూలంగా ఇడ్లీలను కూడా అందజేస్తుండాలన్నారు ఈ ఓ.గతంలో కొనుగోలు చేసిన చపాతీ తయారీ యంత్రానికి వెంటనే మరమ్మతులు చేయించాలని ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ని ఆదేశించారు.సందర్భానుసారంగా సాయంకాలం అల్పాహారంలో చపాతీలను కూడా అందజేస్తుండాలన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం మంచి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండే రోజులలో చపాతీలను అందజేస్తుండాలన్నారు.
అన్నప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులు అధికసమయం వేచివుండకుండా వుండేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు ఈ ఓ . ఇందుకుగాను అన్నదాన మందిరంలోని ఆయా భోజనశాలలో తగు ముందస్తు ఏర్పాట్లు ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.అన్నప్రసాద వితరణ సమయం లో సంబంధిత అధికారులు ప్రతి హాలులో కూడా అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేటట్లు పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రతి హాలును కూడా ప్రత్యేకంగా సిబ్బందిలో ఒకరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.అదేవిధంగా అన్నప్రసాదాలు వడ్డించే సిబ్బంది తప్పనిసరిగా వస్త్ర నిబంధన (డ్రస్కోడ్) పాటించాలన్నారు. ముఖ్యంగా సిబ్బంది భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు.అన్నదాన మందిరములో శుచీ శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు అన్నదాన మందిరాన్ని శుభ్రపరుస్తుండాలని సిబ్బందిని ఆదేశించారు.
అన్నప్రసాదం, అల్పాహారాలను తప్పనిసరిగా అరటి ఆకులలోనే వడ్డించాలని ఈ ఓ సూచించారు.ప్రతీరోజు కూడా భక్తులతో మాట్లాడుతూ అన్నప్రసాదవితరణపై వారి అభిప్రాయాలను , సూచనలను కూడా తీసుకుంటుండాలని పర్యవేక్షకులను ఆదేశించారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, అన్నప్రసాద వితరణ పర్యవేక్షకురాలు దేవిక, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు భవన్కుమార్, పలువురు అన్నప్రసాద వితరణ, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.