శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ ఓ ఎస్.లవన్న మంగళవారం కేంద్ర విచారణ కార్యాలయాన్ని (గంగాసదన్ ) ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. తరువాత ఈ ఓ మాట్లాడుతూ భక్తులకు వసతి కేటాయింపునకు సంబంధించి ఆన్లైన్ సదుపాయాన్ని మరింతగా పెంపొందించాలని వసతి , ఐ.టి. విభాగాలను ఆదేశించారు.దేవస్థానం కాటేజీలను కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచాలన్నారు. శని, ఆది, సోమ వారాలలో 30 శాతం కాటేజీలను, మంగళ , బుధ ,గురు, శుక్ర వారాలలో 50 శాతం కాటేజీలను ఆన్లైన్ లో కేటాయించే విధంగా వెంటనే చర్యలను చేపట్టాలన్నారు. తక్కిన కాటేజీలను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాలన్నారు.
కాటేజీల వివరాలు, వాటి అద్దె మొదలైన సమాచారం భక్తులకు తెలిసే విధంగా అవసరమైన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్, శ్రీశైలప్రభ విభాగాలను ఈ ఓ ఆదేశించారు. భక్తులకు గదులు కేటాయించేటప్పుడు వారి ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ లేదా డైవింగ్ లైసెన్సు మొదలైన గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని కౌంటర్ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా భక్తులందరితో మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించారు.ఏ ఒక్క భక్తుడి నుండి కూడా ఫిర్యాదు లేకుండా సమర్థవంతంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. కాటేజీలు ఖాళీ అయిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా శుభ్రపర్చడం ఎంతైనా అవసరమన్నారు. దీంతో ఆలస్యం లేకుండా భక్తులకు గదులు కేటాయించే వీలు కలుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.గంగాసదన్ ప్రాంగణములో మరింతగా పచ్చదనాన్ని . పెంపొందించాలని కూడా ఆదేశించారు.