
శ్రీశైల దేవస్థానం:దేవదాయశాఖ శిల్పి విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు గురువారం ఆలయంలోని ప్రాచీన కట్టడాలను పరిశీలించారు. పరిశీలనలో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, దేవదాయశాఖ స్థపతి పి. పరమేశప్ప, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధర్ రెడ్డి, కర్నూలు డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్రీనివాసప్రసాద్, దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ/సి) పి. చంద్రశేఖరశాస్త్రి,, సహాయ స్థపతి అయిలూరి ఉమా వెంకట జవహర్లాల్, ఎఈలు భవన్ కుమార్, రాజారావు, స్ట్రక్చరర్ ఇంజనీర్లు వేణుగోపాల్ రెడ్డి, రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ పశ్చిమ ప్రాకార కుఢ్యం, ఆలయప్రాంగణములోని బండపరుపు, వీరశిరోమండపం, నందిమండపం, అమ్మవారి ఆలయ ద్వారగోపురం మొదలైనవాటిని పరిశీలించారు.
స్థపతి పి. పరమేశప్ప మాట్లాడుతూ క్షేత్రపరిధిలోని ప్రాచీనకట్టడాలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని దేవస్థానానికి సూచించారు.అదేవిధంగా శ్రీస్వామిఅమ్మవార్ల పాఠశాలలకు సాలాహారాలు నిర్మించి సంప్రదాయ అలంకరణలు చేయాలన్నారు.ప్రధానాలయ ప్రాంగణములోని బండపరుపు హెచ్చుతగ్గులు లేకుండా సమతలంగా ఉండేవిధంగా తగు మరమ్మతులు చేపట్టాలన్నారు.ఇంకా అమ్మవారి ఆలయములో ఉత్తర భాగంలో నిర్మాణంలో ఉన్న సాలుమండప నిర్మాణాన్ని వేగవంతం చేసి పనులు పూర్తి చేయాలన్నారు.