శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా మంగళవారం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు క్షేత్ర పరిధిలోని పలు రహదారులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ ప్రధాన రహదారులలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెబుతూ వాహనాల కదలికల క్రమబద్దీకరణకు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా దేవస్థానం వైద్యశాల కూడలి, విద్యుత్ శాఖ ప్యూజ్ ఆఫ్ కాల్ కార్యాలయం కూడలి, యాదవసత్రం కూడలి మొదలైనచోట్ల వాహనాలరద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ కూడళ్ళ వద్ద వాహనాల క్రమబద్దీకరణ పకడ్బందీగా ఉండాలన్నారు. వారాంతపు సెలవురోజులు, పర్వదినాలలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని చెబుతూ, ఆయా రోజులలో ముందస్తు ప్రణాళికలతో వాహనాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు.వీలైనన్ని చోట్ల రహదారుల విస్తరణకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
అన్నప్రసాద వితరణ భవన సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మరు చుట్టూ మరింత దృఢమైన కంచెను ఏర్పాటు చేయాలని కూడా ఇంజనీరింగ్ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు. అదేవిధంగా పెద్దసత్రం ముందు భాగంలో ఎగుడు దిగుడుగల ఫ్లోరింగును తగు మరమ్మతులు చేసి చదునైన ఫ్లోరింగును ఏర్పాటు చేయాలన్నారు.ఆలయం ముందు భాగంలో గంగాధర మండపం చుట్టూ స్వల్ప విస్తీర్ణములో సుందరీకరణకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు మురళీధర్రెడ్డి, ఎలక్ట్రికల్ విభాగపు ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు సుబ్బారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీరు జైపాల్ నాయక్, సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్, ఉద్యాన వన విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి , ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.