
శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్రగా క్షేత్రాన్ని చేరుకుంటున్నారు. కాలిబాటలో అటవీ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ మొదలైన శాఖల సమన్వయం తో పలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా కైలాస ద్వారం వద్ద భక్తుల సౌకర్యార్థం విశాలమైన తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసారు.
కైలాస ద్వారానికి నిరంతరం మంచినీటి సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా మంచినీరు అందిస్తున్నారు.
కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు సంబంధిత ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి కైలాసద్వారం , భీమునికొలను మెట్లమార్గం వద్ద బుధవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కైలాసద్వారం వద్ద కన్నడ స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న అన్నదాన శిబిరాన్ని పరిశీలించారు. దాతలు నిర్వహిస్తున్న ఈ అన్నదాన నిర్వహణకు దేవస్థానం పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా అన్నదాన నిర్వహణకు చలువ పందిర్లు ఏర్పాటు, మంచినీటిసరఫరా, మజ్జిగ సరఫరా, విద్యుద్దీకరణ మొదలైన ఏర్పాట్లను దేవస్థానం చేస్తోంది.
కార్యనిర్వహణాధికారి ,అన్నదాన నిర్వాహకులతో మాట్లాడుతూ తప్పనిసరిగా శుచీ శుభ్రతలను పాటించాలన్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు మూతలు పెడుతుండాలన్నారు.కైలాస ద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.