×

చలువ పందిర్లను పెంచాలి-ఈ ఓ

చలువ పందిర్లను పెంచాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు   ఉగాది ఉత్సవాల  ఏర్పాట్లు  పరిశీలించారు. ఈ ఉత్సవాలకుగాను కర్ణాటక , మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవాల నిర్వహణకుగాను వివిధ విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆదివారం  కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించి ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధీకులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

యాంపీ థీయేటర్, మల్లమ్మకన్నీరు, పలు ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, వలయరహదారి, మొదలైనవాటిని కార్యనిర్వహణాధికారి  పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు , సిబ్బంది అందరు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఉత్సవాల ప్రత్యేక విధులను నిర్వహిస్తుండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అన్ని విభాగాల అధిపతులు ( యూనిట్ అధికారులు), పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు తమ విభాగంలోని సిబ్బందిని సమన్వయ పరుస్తూ ఆయా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టికనబర్చాలన్నారు.

 భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలుచోట్ల చలువపందిర్లు (పైప్ పెండాల్స్ ) వేయడం జరిగింది. కార్యనిర్వహణాధికారి ఆయా చలువపందిర్లు పరిశీలిస్తూ, ఎండతీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా వీలైనన్నీ ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల కూడా చలువ పందిర్లను వేయాలన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకంటే కూడా మరిన్ని అదనపు ప్రదేశాలలో కూడా ఈ చలువ పందిర్లు ఉండాలన్నారు. ముఖ్యంగా యాంపీథియేటర్ వద్ద విశాలమైన ఆరుబయలు ప్రదేశంలో ఈ చలువ పందిర్లు ఉండాలన్నారు.అన్ని చలువ పందిర్ల వద్ద ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం మంచినీటి సరఫరా ఉండాలన్నారు. అదేవిధంగా తగు విధంగా లైటింగు కూడా ఉండాలన్నారు. కాగా మంచినీటి సరఫరాకు ట్యాంకర్ల ద్వారానే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా చేపట్టాలని సూచించారు.

క్షేత్రపరిధిలో పలుచోట్ల అన్నదానం చేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలకు దేవస్థానం తరుపున అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు ఈ ఓ . ఆయా అన్నదాన ప్రదేశాలకు మంచినీటిని సమయానుసారంగా అందజేస్తుండాలన్నారు. అన్నదాన ప్రదేశాలలో తగినంత లైటింగు ఏర్పాటు కూడా ఉండాలన్నారు. భక్తులరద్దీ అధికంగా ఉంటున్న కారణంగా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందిగా కొనసాగిస్తుండాలన్నారు. చలువ పందిర్లు, ప్రధాన కూడళ్ళు, ఉద్యానవనాలు, అన్నదానం చేస్తున్న స్థలాలు తదితర ప్రదేశాలతో పాటు క్షేత్రపరిధిలోని అన్నిచోట్ల కూడా ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగిస్తుండాలన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు డంపుయార్డుకు తరలిచేందుకుగాను అదనంగా కూడా ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.అదేవిధంగా శౌచాలయాల శుభ్రతపట్ల అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. శౌచాలయాలకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.

యజ్ఞవాటిక వద్ద గల పార్కింగు ప్రదేశంలో ఆయా బస్సులు నిలిపేందుకు రీజియన్లు మరియు డివిజన్ల వారిగా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దీనివలన ప్రాంతాలవారిగా, క్రమపద్ధతిలో బస్సులు నిలిపే అవకాశం ఉంటుందన్నారు.దుకాణదారులు ఆయా వస్తువులను అధికరేట్లకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు తగు తనిఖీలు చేస్తుండాలని రెవెన్యూ విభాగాన్ని ఆదేశించారు.

ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, పి.వి. సుబ్బారెడ్డి, చంద్రశేఖరశాస్త్రి, సహాయ ఇంజనీర్లు రాజేశ్వరరావు, రంగప్రసాద్, భవన్, ప్రణయ్, మేఘనాథ్, ఉద్యానవన అధికారి లోకేష్, విశ్రాంత ఉద్యానవన అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి,ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed