
శ్రీశైల దేవస్థానం:మార్చి 1 నుండి 11 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వివిధ విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా బుధవారం కార్యనిర్వహణాధికారి పుష్కరిణి, సిద్ధరామప్ప కొలను మెట్లమార్గం, డార్మిటరీలు, బస్టాండు ప్రాంతం, బసవవనం తదితర ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పుష్కరిణి వద్ద తగినంత స్థాయిలో విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పుష్కరిణి ప్రాంగణములో భక్తులు కూర్చోనేందుకు వీలుగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు.ఉత్సవ సమయాలలో భక్తులు తలనీలాలను సమర్పించేందుకు వీలుగా పుష్కరిణీ సమీపంలో తాత్కాలిక కల్యాణకట్టను వీలైనంత మేరకు విశాలంగా ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం సిద్ధరామప్ప మెట్లమార్గాన్ని ఈ ఓ పరిశీలించారు. ఈ మెట్ల మార్గానికి తగిన మరమ్మతులు చేయాలన్నారు. అదేవిధంగా పుష్కరిణి దిగువ ప్రాంతంలో ఉండే రహదారికి కుడివైపు ప్రాంతంలో వీలైనచోట్ల ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగు ఏర్పాటు చేయాలన్నారు.ముఖ్యంగా రాజులసత్రం – దేవస్థానం పాతవర్కుషాపు ప్రాంతంలో గల డివైడరు లో మరిన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. అన్ని డివైడర్లలో కూడా పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.
ఆ తరువాత పాతాళగంగమార్గంలోని దేవస్థానం డార్మెటరీని ఈ ఓ పరిశీలించారు. ఈ డార్మిటరీలో విద్యుద్దీపాలు, అన్ని ఫ్యాన్లు సజావుగా పనిచేసేవిధంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలన్నారు. అదేవిధంగా ఈ డార్మిటరీ వెనుకభాగంలో డార్మిటరీలకు కూడా అవసరమైన ఏర్పాట్లను చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.ఈ సందర్భంగా డార్మిటరీల వద్ద , పలు చోట్ల ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు, పలుచోట్ల ఏర్పాటు చేసిన శౌచలయాలు మొదలైన వాటిని కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.
అన్ని శౌచాలయాలకు నిరంతరం నీటి సరఫరా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు ఈ ఓ. అదేవిధంగా శౌచాలయాలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం మంచినీటి సరఫరార జరుగుతుండాలన్నారు. అదేవిధంగా ఆరుబయలు ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్న చలువపందిర్ల వద్ద కూడా నిరంతరం మంచినీటిసరఫరా ఉండాలన్నారు.ఉత్సవాలలో భక్తులరద్దీని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఆయా ప్రదేశాలలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగిస్తూ నిరంతరంగా శుభ్రపరిచేవిధానాన్ని ప్రణాళికబద్ధంగా అమలు చేయాలన్నారు. అన్ని ఆరుబయలు ప్రదేశాలలో కూడా తగు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు.తరువాత అన్ని పార్కింగు ప్రదేశాలలో కూడా నేలను చదునుచేసే పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఈ పార్కింగు ప్రదేశాలలో బండరాళ్ళు మొదలైనవాటిని తొలగించాలన్నారు.
గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మరిన్ని పార్కింగు ప్రదేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పార్కింగు ప్రదేశాలలో తగినంత విద్యుద్దీకరణ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. అదేవిధంగా ఈ పార్కింగు ప్రదేశాలలో మంచినీటి వసతి కూడా అందుబాటులో ఉండాలన్నారు.అన్ని పార్కింగు ప్రదేశాల దారులు తెలిసేవిధంగా ఆయా ప్రదేశాలలో సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.ఆరుబయలు ప్రదేశాలలో మరియు పలుచోట్ల రహదారికి ఇరువైపులా చేపట్టిన పిచ్చిమొక్కలను తొలగించే పనిని (జంగిల్ క్లియరెన్స్) త్వరలో పూర్తి చేయాలన్నారు.ఈ పర్యటనలో పలుచోట్ల గల జలప్రసాద్ ఆర్.ఓ. ప్లాంట్లను కూడా కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, జి. మురళీధరరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు ( ఐ/సి) పి. చంద్రశేఖరశాస్త్రి, పర్యవేక్షకులు అయ్యన్న విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి లోకేష్, పలువురు సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.