పాతాళగంగ మెట్ల మార్గంలో ఆర్.ఓ ప్లాంటు ఏర్పాటు చేయాలి – ఈ ఓ పెద్దిరాజు

 శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా శనివారం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు  సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పాతాళగంగను పరిశీలించారు. ఈ పరిశీలనలో ముందుగా పాతాళగంగమెట్లమార్గంలో నడిచివెళ్ళి ఆయా ఏర్పాట్లపై పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఓ మాట్లాడుతూ పాతాళగంగ మెట్ల మార్గములో భక్తులకు మంచినీటి వసతికి  ఆర్.ఓ ప్లాంటు ఏర్పాటు చేయాలన్నారు. మెట్లమార్గంలో వచ్చి పోయే భక్తులకు ఇది ఎంతో దోహదకారిగా ఉంటుందన్నారు. అదేవిధంగా పాతాళగంగ మెట్లమార్గం మధ్యలో భక్తులు సేద తీరేందుకు తగు ఏర్పాట్లు కూడా ఉండాలన్నారు.

రానున్న కార్తిక మాసంలో వేకువ జాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడం జరుగుతుందన్నారు. అందుకే మెట్లమార్గంలో తగినంత లైటింగ్ ఏర్పాట్లు ఉండాలన్నారు. అవసరం మేరకు పాతాళగంగలో మరిన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలన్నారు.రక్షణ చర్యలలో భాగంగా పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడింగును సంబంధిత అధికారులు తరచుగా పరిశీలిస్తుండాలన్నారు. ఎప్పటికప్పుడు నీటిమట్టాన్ని పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

పాతాళగంగలో శౌచాలయాలకు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు ఎప్పటికప్పుడు తగు మరమ్మతులు చేస్తుండాలన్నారు. ముఖ్యంగా శౌచాలయాల శుభ్రతపట్ల నిరంతరం శ్రద్ధవహిస్తుండాలన్నారు. స్నానఘట్టాలు, ఆ పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేవిధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు.

పాతాళగంగ వద్ద విధులు నిర్వహిస్తున్న ఈత నిపుణులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అంతకుముందు గోసంరక్షణశాల వద్ద నిర్మిస్తున్న శ్రీగోకులాన్ని పరిశీలించారు. అదేవిధంగా యాంపీథియేటర్ను  కూడా పరిశీలించారు.

print

Post Comment

You May Have Missed