గోశాలలో మరిన్ని నీటి తోట్లను కూడా ఏర్పాటు చేసి, శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి – ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:గోశాలలో మరిన్ని నీటి తోట్లను కూడా ఏర్పాటు చేసి, శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వా లని ఈ ఓ  పెద్దిరాజు ఆదేశించారు .  పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఆదివారం  దేవస్థానం  కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు  దేవస్థాన గోసంరక్షణశాల, మల్లమ్మ మందిరం ( మల్లమ్మ కన్నీరు), యాంఫీ థియేటర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గోశాలలోని ప్రతీగోవుపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గోవులకు ఎప్పటికప్పుడు తగినంత మేతతో పాటు తగినంత త్రాగునీరు కూడా అందిస్తుండాలన్నారు. అవసరమైతే గోశాలలో మరిన్ని నీటి తోట్లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గోశాలలో శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనివలన గోశాలలో పవిత్రత వాతావరణం నెలకొంటుందన్నారు.

గోశాల ప్రహరీ ఎత్తును మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఈ ఓ  ఆదేశించారు.

కాగా గోశాలలో ఇటీవల పలు నీడనిచ్చే మొక్కలను నాటారు. ఈ మొక్కల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధకనబరచాలని ఉద్యానవన సిబ్బందిని కార్యనిర్వహణాధికారి  ఆదేశించారు.

మల్లమ్మ మందిరం పరిశీలన :

మల్లమ్మ మందిరం (మల్లమ్మకన్నీరు) పరిశీలన సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ మల్లమ్మ మందిర క్యూలైన్లలోని బండపరుపుకు ( ఫ్లోరింగునకు) తగు మరమ్మతులు చేయాలన్నారు.అదేవిధంగా మల్లమ్మ మందిరంలోని ఉద్యానవనాన్ని మరింతగా సుందరీకరించాలన్నారు. ముఖ్యంగా ఉద్యానవనములో బిల్వం, కదంబం, ఉసిరి మొదలైన మరిన్ని మొక్కలను నాటాలన్నారు. మల్లమ్మ మందిరం ప్రాంగణములోని అన్ని కటాంజనాలకు పెయింటింగ్ పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.మల్లమ్మ మందిర ప్రహరీఎత్తు పెంచేందుకు కూడా ప్రణాళికలు రూపొందించాలన్నారు.యాంఫీథియేటర్ పరిసర ప్రాంతాలలో రహదారి విస్తరణకు కూడా ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, జి. మురళీధరరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి  శ్రీనివాసరావు, సహాయ ఇంజనీరు ఎం. జైపాల్ నాయక్, ఉద్యానవన విభాగపు విశ్రాంత సహాయ సంచాలకులు జి. ఈశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గోవులకు టీకామందు:

దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణశాలలోని 870 కి పైగా గల ఆవులకు, ఆరుమాసాలు పై బడిన ఆవుదూడలకు, ఆంబోతులకు, కోడెదూడలకు వ్యాధి నిరోధక టీకాలను ఇస్తున్నారు. 25న ప్రారంభించిన ఈ టీకా కార్యక్రమం  ఈ రోజు ముగిసింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ఆదేశాల మేరకు ఈ టీకా కార్యక్రమం జరిగింది.గోవులో సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులైన గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు రాకుండా ఉండేందుకు గాను ఈ వ్యాధి నిరోధక టీకాలను ఇస్తున్నారు.ఇండియన్ ఇమ్యునాలజికల్ కంపెనీ, హైదరాబాద్ వారు ఈ టీకామందును విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, గోశాల పర్యవేక్షకులు బి. శ్రీనివాసులు, సంబంధిత గుమాస్తా ఎం. కార్తీక్, వెటర్నరీ సిబ్బంది పి. నాగన్న, జి. విజయరాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.