
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోగా అవసరమైన అన్ని మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఈ ఓ ల వన్న ఆదేశించారు. పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా మంగళవారం కార్యనిర్వహణాధికారి లవన్న పలు ఇంజనీరింగ్ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆలయ ప్రాంగణము, ఆలయ పుష్కరిణి ( సరస్వి పుష్కరిణి), పంచమఠాల పునర్నిర్మాణ పనులను ఈ ఓ పరిశీలించారు.
ఈ ఓ మాట్లాడుతూ ఫిబ్రవరి 11న ప్రారంభంకానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోగా అవసరమైన అన్ని మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు.ప్రధానాలయ ప్రాంగణములో బండపరుపుకు అవసరమైనచోట్ల తగు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా బండపరుపు ఎగుడుదిగుడుగా ఉన్నచోట బండపరుపు సరిచేసి సిమెంట్ పాయింటింగ్ పనులను చేయాలన్నారు.
అదేవిధంగా అమ్మవారి ఆలయప్రాంగణములో ఉత్తర భాగాన నిలిచిపోయిన సాలుమండప నిర్మాణ పనులను వెంటనే తిరిగి ప్రారంభించాలన్నారు ఈ ఓ అన్నారు.అమ్మవారి ఆలయములో తూర్పు, దక్షిణభాగాలలో ఉన్నట్లుగానే ఉత్తర భాగంలో కూడా ప్రాచీన నిర్మాణశైలిలోనే రాతికట్టడంగా ఈ సాలుమండపం ఉండాలన్నారు.
తరువాత ఆలయపుష్కరిణిని ఈ ఓ పరిశీలించారు. ఆలయ పుష్కరిణి వెనుకవైపు ఎగువభాగాన (ప్రధానాలయ తూర్పు ప్రాకారకుడ్యానికి ఎదురుగా మాడవీధికి తూర్పువైపు) రక్షణ చర్యలలో భాగంగా స్టయిన్‌లెస్ స్టీల్‌తో రక్షణగ్రిల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ గ్రిల్ ఏర్పాటు వలన ఆలయ తూర్పు మాడవీధి నుంచి భక్తులు సౌకర్యవంతంగా పుష్కరిణిని తిలకించే అవకాశం లభిస్తుందన్నారు.
అనంతరం ఘంటామఠం పనులను ఈ ఓ పరిశీలించారు. భక్తులు పంచమథాలన్నింటిని ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్నిమఠాలను కలుపుతూ (ఒకే పర్కూట్ ) చేపట్టిన ఏక రహదారి రోడ్డు) నిర్మాణాన్ని పరిశీలించారు.ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా నిర్మాణములో పూర్తి నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.
పంచమఠాలలోని అన్ని ప్రాంగణాలచుట్టూ పచ్చికబయళ్ళు, (ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్) ఏర్పాటు చేయడంతో పాటు దేవతా వృక్షాలతో ఉద్యానవనాలను ఏర్పాటు చేయాలన్నారు ఈ ఓ.ముఖ్యంగా బిల్వం, కదంబం, ఉసిరి, దేవగన్నేరు లాంటి దేవతా వృక్షాలను నాటాలన్నారు. వీటితో పాటు సుందరీకరణ మొక్కలు కూడా ప్రతిపాదిత ఉద్యానవనాలలో ఉండాలన్నారు.తరువాత హేమారెడ్డిమల్లమ్మ మందిరం వద్ద నిర్మిస్తున్న గోపూజా మందిరం ( సురభిగోష్టము) నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ గోపూజామందిరంలో గోవులు సులభంగా మేత మేసేందుకు, నీరు త్రాగేందుకు తగు విధమైన ఏర్పాట్లు ఉండాలన్నారు.అదేవిధంగా భక్తులు సౌకర్యవంతంగా గోవును పూజించే విధంగా గోపూజా మందిరాన్ని తీర్చిదిద్దాలన్నారు.ఈ గోపూజా పరిసర ప్రాంతాలలో కూడా దేవతా వృక్షాలను, సుందరీకరణ మొక్కలను పెంచడంతో పాటు పచ్చికబయళ్ళను ఏర్పాటు చేయాలన్నారు. గోపూజా మందిర పరిసరాలలో భక్తులు కూర్చోనేందుకు వీలుగా సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మల్లమ్మ మందిరం ప్రాంగణంలో ఉద్యానవనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉద్యానవన విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు. ఇప్పటికే అక్కడి ఉద్యానవన అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను అనుసరించి సుందరీకరణ మొక్కలను నాటాలన్నారు. ఈ ఉద్యాన వనాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు.
పరిశీలనలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్, సహాయ కార్యనిర్వహక ఇంజనీరు ఎం. ప్రణయ్, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ , ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.