
శ్రీశైల దేవస్థానం: అక్టోబరు 26 నుంచి నవంబరు 23 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్న నేపధ్యంలో
భక్తులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఇంజనీరింగ్, ఆలయం, క్యూకాంప్లెక్స్, భద్రతా విభాగాల వారితో కలిసి దర్శనం క్యూలైన్లను, ఆర్జితసేవాక్యూలైన్లను, దర్శనం ఆర్జితసేవా కౌంటర్లను, విరాళాల సేకరణ కేంద్రం, లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాలు మొదలైన వాటిని పరిశీలించారు.
కార్తీక దీపారాధన ఏర్పాట్లకు సంబంధించి గంగాధర మండపం, ఉత్తర శివవీధి (శివాజీగోపుర ద్వారా వెలుపలి ప్రాంతం), లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహించే పుష్కరిణి ప్రాంతాన్ని ఈ ఓ పరిశీలించారు.ప్రస్తుతము అమలులో ఉన్నట్లుగానే కార్తీక మాసంలో సర్వదర్శనం (ఉచిత దర్శనం)తో పాటు శీఘ్రదర్శనం (రూ.150/-ల రుసుముతో), అతి శీఘ్రదర్శనం (రూ.300/-ల రుసుముతో) భక్తులకు అందుబాటులో ఉంటాయి.
సాధారణ రోజులలో నిర్దిష్ట వేళలో స్పర్శదర్శనం ( రూ. 500/-ల రుసుముతో) అందుబాటులో ఉంటుంది. రద్దీ రోజులలో రూ.500/-ల దర్శనం టికెట్లకు కూడా స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కార్తీక మాసములో ప్రస్తుతం ఉన్న శీఘ్రదర్శనం (రూ. 150/-లు), అతి శీఘ్రదర్శనం (రూ. 300/-లు) కౌంటర్లకు అదనంగా మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ అదనపు కౌంటర్లలో ఒకటి శీఘ్ర దర్శనానికి రూ.150/-లు) మరొకటి అతి శీఘ్రదర్శనం (రూ.300/-లు) వినియోగించాలన్నారు.ఆర్జిత సేవలకు కూడా ప్రస్తుతం ఉన్న కౌంటర్ తో పాటు మరో అదనపు కౌంటరు ఏర్పాటు చేయాలన్ని సూచించారు. దర్శనం క్యూలైన్లు , దర్శన, ఆర్జిత సేవా కౌంటర్లను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా తగినన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.క్యూకాంప్లెక్స్‌లోని మొత్తం కంపార్టుమెంట్లలో 12 కంపార్టుమెంట్లను ఉచిత దర్శనానికి వినియోగించాలన్నారు. శీఘ్రదర్శనానికి (రూ.150/-లు) 6 కంపార్టుమెంట్లను వినియోగించాలని సూచించారు. ఆయా క్యూలైన్లలో శుచీ శుభ్రతలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్నారు.
ఆయా రోజులలో దర్శనం వేళలు, దర్శనానికి పట్టే సమయం మొదలైన సమాచారాన్ని ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా నిరంతరం తెలియజేస్తుండాలని ఆలయ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు.క్యూకాంప్లెక్స్‌లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు అందజేస్తుండాలన్నారు. రద్దీరోజులలో ఉదయం వేళలో భక్తులకు వేడిపాలను కూడా అందించాలని ఆదేశించారు.
విరాళాల సేకరణ పరిశీలన:
క్యూలైన్ల తరువాత కార్యనిర్వహణాధికారి విరాళాల సేకరణ కేంద్రాన్ని (డొనేషన్ కౌంటర్) పరిశీలించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దాతలకు దేవస్థానం నిర్వహిస్తున్న విరాళాల పథకాల గురించి వివరంగా తెలియజేస్తుండాలని అక్కడి సిబ్బందికి సూచించారు.ముఖ్యంగా దాతలు ఆయా పథకాలకు రూ. 50,000/-లు లేదా 1,00,000/-లు చెల్లించినప్పుడు ఆయా నిర్దిష్ట వేళలో ప్రత్యేక దర్శనం కల్పించాలన్నారు.
లడ్డు విక్రయ కేంద్రాల పరిశీలన :
విరాళాల సేకరణ కేంద్రం పరిశీలన తరువాత లడ్డుప్రసాదాల విక్రయ కేంద్రాలను ఈ ఓ పరిశీలించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కార్తిక మాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేస్తుండాలని ప్రసాదాల తయారీ విభాగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 7 విక్రయ కౌంటర్లతో పాటు అదనంగా మరో 4 కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.భక్తులు అధిక సమయం క్యూలైన్లలో వేచివుండకుండా త్వరితంగా ప్రసాదాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని విక్రయ కేంద్ర పర్యవేక్షకులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటుండాలని సంబంధిత పర్యవేక్షకులను ఆదేశించారు.
కార్తీక దీపారాధన ఏర్పాట్లు :
లడ్డు విక్రయ కేంద్ర పరిశీలన తరువాత కార్యనిర్వహణాధికారి కార్తీక దీపారాధన ఏర్పాట్లకు సంబంధించి ఆయా ప్రదేశాలను పరిశీలించారు.గంగాధర మండపం వద్ద భక్తులు దీపారాధనలు చేసుకునే వీలుగా తగినన్నీ ఐరన్ స్టాండ్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఉత్తర శివవీధిలో ( మాడవీధి) భక్తులు పూజించుకునే వీలుగా ఉసిరిక చెట్లను (ఉసిరిక చెట్ల కుండీలను) ఏర్పాటు చేయాలన్నారు.కనీసం 50 చెట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, పారిశుద్ధ్య విభాగపు పర్యవేక్షకులు పి. వెంకటేశ్వర్లు, లడ్డు విక్రయ కేంద్ర పర్యవేక్షకులు శ్రీమతి దేవిక, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి, ఉద్యానవన అధికారి లోకేష్, అసిస్టెంట్ ఇంజనీర్లు మేఘనాథ్, భవన్ కుమార్, ప్రణయ్, విష్ణుబాబు దేవస్థానం ప్రచురణల విభాగం ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.