శ్రీశైల దేవస్థానం:ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు జరుగుతాయి.
భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాసోత్సవాలకు వివిధ విసృత ఏర్పాట్లు
జరుగుతున్నాయి.ఇందులో భాగంగా మంగళవారం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఇంజనీరింగ్, ఆలయం,
క్యూకాంప్లెక్స్, పారిశుద్ధ్య విభాగ అధికారులతో కలిసి క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆర్జితసేవా క్యూలైన్లను,
శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు, విరాళాల సేకరణ కేంద్రం, మొదలైన వాటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక
క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు.శ్రీ స్వామివారి స్పర్శ్మదర్శనం, వివిధ ఆర్జితసేవలకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనాలకు కూడా వేరు వేరు క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు.
దర్శన క్యూలైన్లు , శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్ కౌంటర్లను భక్తులు సులభంగా
గుర్తించేందుకు వీలుగా తగినన్నీ సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు ఈ ఓ.అదేవిధంగా క్యూకాంప్లెక్స్ మొత్తం కంపార్టుమెంట్లలో 12 కంపార్టుమెంట్లను ఉచిత దర్శనానికి
వినియోగించాలన్నారు. శీఘ్రదర్శనానికి రూ. (150 /-లు) ఆరు కంపార్టుమెంట్లను వినియోగించాలని సూచించారు.
ఆయా క్యూలైన్లలో శుచీశుభ్రతల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్బాలన్నారు ఈ ఓ.ముఖ్యంగా క్యూకాంప్లెక్స్ లోని శౌచాలయాల శుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. క్యూకాంప్లెక్స్‌లో మరిన్ని ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా విద్యుద్దీపాలు సజావుగా పనిచేసేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తుండాలని ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్ లోని భక్తులకు నిరంతరం మంచీనీరు, అల్పాహారం, బిస్కెట్లు అందజేస్తుండాలన్నారు.క్యూలైన్లను పరిశీలించిన తరువాత విరాళాల సేకరణ కేంద్రాన్ని (డొనేషన్ కౌంటర్) కూడా
కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.క్యూకాంప్లెక్స్ లో మరో 4 శౌాచాలయాలను అదనంగా నిర్మించేందుకు చర్యలను చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దాతలకు దేవస్థానం నిర్వహిస్తున్న విరాళాల
పథకాల గురించి వివరంగా తెలియజేస్తుండాలని అక్కడి సిబ్బందికి ఈ ఓ సూచించారు.ముఖ్యంగా దాతలు ఆయా పథకాలకు రూ. 50,000/-లు లేదా1,00,000/-లు చెల్లించినప్పుడు ఆయా
నిర్ధిష్ట వేళలో ప్రత్యేక దర్శనం కల్పించాలన్నారు.కాగా ప్రస్తుతము అమలులో ఉన్నట్లుగానే శ్రావణమాసంలో సర్వదర్శనం (ఉచితదర్శనం)తో పాటు శీఘ్రదర్శనం (రూ.150/-ల రుసుముతో), అతిశీఘ్రదర్శనం (రూ.300/-ల రుసుముతో) కొనసాగతాయి. ఈ శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం 70 శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు అంటే
శ్రావణమాసం ముగిసేంత వరకు వచ్చే శని, ఆది,సోమవారాలు , పర్వదినాలు / సెలవురోజులైన
స్వాతంత్ర్య దినోత్సవం ( 15.08.2023), వరలక్ష్మీవ్రతం ( 25.08.2023), శ్రావణపౌర్ణమి (31.08.2023),
శ్రీ కృష్ణాష్టమి (06.09.2023) రోజులలో శ్రీ స్వామివారి గర్భాలయ అభిషేకాలు , సామూహిక
అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేసారు.
అభిషేకాలు నిలుపుదల చేసిన ఈ నిర్ధారిత రోజులలో రూ. 500/-ల రుసుముతో శ్రీస్వామివార్ల
స్పర్శదర్శనానికి అవకాశం కల్పించారు. రోజుకు నాలుగు విడతలలో స్పర్శదర్శనం కల్పిస్తారు.
ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే స్పర్శదర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్లను భక్తులు ఆన్‌లైన్
ద్వారా దేవస్థానం వెబ్‌సైట్ నుంచి పొందాల్సి వుంటుంది.భక్తులు మరింత సులభతరంగా టికెట్లను పొందేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చిన దేవస్థానం యాప్ నుంచి కూడా ఆయా టికెట్లను పొందవచ్చు.
టికెట్ల లభ్యతను బట్టి ఒక గంట ముందువరకు కూడా భక్తులు ఆన్‌లైన్ ద్వారా ఆయా టికెట్లను
పాందే వీలు కల్పించారు.అదేవిధంగా ఆర్జితసేవా కర్తలు, స్పర్శదర్శనం టికెట్ పొందిన వారు విధిగా వారు ఆన్‌లైన్
ద్వారా పొందిన టికెట్ ప్రింట్ కాపీని ( హార్ట్ కాపీని) వెంట తెచ్చుకోవలసివుంటుంది. ఆన్‌లైన్ ద్వారా పొందిన
ఆయా టికెట్లను స్కానింగ్ జరిపిన తదుపరి మాత్రమే ఆర్జితసేవాకర్తలను, స్పర్శదర్శనం టికెట్లు
పొందిన వారిని అనుమతిస్తారు.
సేవాకర్తలు , స్పర్శదర్శనం టికెట్ పొందిన వారు తప్పనిసరిగా ఆధార్‌కార్డు
గుర్తింపు ప్రతిని ( ఒరిజినల్ లేదా జిరాక్స్ ప్రతిని) తీసుకుని రావలసి వుంటుంది.
ఆధార్ గుర్తింపును అనుసరించే ఆర్జితసేవాకర్తలను, స్పర్శదర్శనం టికెట్లు పొందిన వారిని
అనుమతిస్తారు.కాబట్టి భక్తులు టికెట్టు / ప్రింటు కాపీని, ఆధార్ కార్డ్ ప్రతిని ఒరిజినల్ ఆధార్ కార్డు
తప్పనిసరిగా తెచ్చుకోవాలి.కాగా ఈ నిర్ధిష్ట రోజులలో మినహా తక్కిన రోజులలో మంగళ,బుధ,గురు,శుక్రవారాలలో మధ్యాహ్నం గం. 2.00ల నుంచి కల్పించబడుతున్న ఉచిత స్పర్శదర్శనం యథావిధిగా కొనసాగుతుంది.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి.
మోహన్, పర్యవేక్షకులు మధుసూధన్‌రెడ్డి, హిమబిందు, అయ్యన్న, నాగరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు
(ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ/సి) పి.వి.సుబ్బారెడ్డి, సంబంధిత
అసిస్టెంట్ ఇంజనీర్లు , ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ పాల్గొన్నారు.