శ్రీశైల దేవస్థానం:మార్చి 27 నుండి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్ణయించినందున భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అధిక సంఖ్యలో కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు క్షేత్రానికి వస్తారు కనుక అన్ని విభాగాల వారు సమన్వయముతో విధులు నిర్వహిస్తూ భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలన్నారు. ముఖ్యంగా క్యూలైన్ల నిర్వహణ ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు.ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ విషయమై పోలీస్ శాఖ వారి పూర్తి సహాయ సహకారాలు పొందాలన్నారు.
క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారాలను, బిస్కెట్లను అందజేస్తుండాలన్నారు.రద్దీ సమయాలలో క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకు గాను తగిన స్థాయిలో సెక్యూరిటి సిబ్బందిని, శివసేవకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళికను అనుసరించి క్యూలైన్లను నిర్వహించాలన్నారు.క్యూ కాంప్లెక్స్ లోని మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్లు అన్ని కూడా వినియోగానికి అందుబాటులో వుండే విధముగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూకాంప్లెక్స్ లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
క్యూకాంప్లెక్స్ లోనూ , ఆర్జితసేవా కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్యాన్లు సక్రమంగా పనిచేసేవిధంగా ఎలక్ట్రికల్ విభాగపు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.
ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా కన్నడభాషలో కూడా ఎప్పటికప్పుడు భక్తులకు ఆయా సూచనలు, సలహాలను తెలియజేస్తుండాలన్నారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి పాతాళగంగలో ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చకునే గదులు, శౌచాలయాలు మొదలైనవాటిని పరిశీలించారు.అదేవిధంగా అక్కడి దుస్తులు మార్చుకునే గదులకు, శౌచలయాలకు అవసరమైన మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పాతాళగంగలో నీటిమట్టం తగ్గుతున్న కారణంగా పాతాళగంగ స్నానఘట్టాల ఎగువ భాగంలోనే జల్లుస్నానానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. .
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈత నిపుణులతో మాట్లాడుతూ వారికి పలు సూచనలు చేశారు.
పాతాళగంగలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని అక్కడ ఈత నిపుణులను ఆదేశించారు. అదేవిధంగా భక్తులతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారికి తగు సూచనలు చేస్తుండాలన్నారు.ముఖ్యంగా పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలను తొలగిస్తుండాలని సూచించారు.అదేవిధంగా అక్కడ ఉన్న శౌచాలయాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు.
ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, సహాయకార్యనిర్వహణాధికారులు బి. మల్లికార్జునరెడ్డి, బి. స్వాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ /సి) పి.వి. సుబ్బారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.