శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం సాయంకాలం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి పాతాళగంగను పరిశీలించారు.ఈ సందర్భంగా పాతాళగంగలో బ్యారికేడింగ్, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చకునే గదులు, శౌచాలయాలు మొదలైనవాటిని కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పాతాళగంగ వద్ద ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని అనుసరించి అవసరమైనచోట్ల దృఢమైన బ్యారికేడింగ్ ఏర్పాట్లు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఇప్పటికే పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడింగును సంబంధిత అధికారులు తరచుగా పరిశీలిస్తుండాలన్నారు.
వృద్ధులు చిన్నపిల్లలకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా పాతాళగంగ స్నానఘట్టాల ఎగువ భాగంలో జల్లుస్నానం ఏర్పాట్లు గత సంవత్సరం కంటే అధికంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా అక్కడి ఈత నిపుణులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. పాతాళగంగలో విధులు నిర్వహిస్తున్న ఈత నిపుణులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.పాతాళగంగ స్నానఘట్టాలు అక్కడి శౌచాలయాలను నిరంతరం పరిశుభ్రంగా ఉండేవిధంగా నిర్వహిస్తుండాలని కూడా పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలన్నారు.
పాతాళగంగ పరిసరాలలో మరిన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేసి విద్యుద్దీకరణను పెంచాలని కూడా ఎలక్ట్రికల్ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు.
ఇక పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు సబ్బులు , షాంపులు వినియోగించడం వలన నీరు కలుషితమవుతాయని, నదిలో పుణ్యస్నానాలు చేసే భక్తులు సబ్బులు, షాంపులు వినియోగించకుండా వుండేవిధంగా వారిలో అవగాహన కల్పించాలన్నారు.ఈ విషయాన్ని అక్కడి ప్రసార వ్యవస్థ ద్వారా తెలియజేయడంతో పాటు భక్తులకు అవగాహన కలిగే విధంగా మరిన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, పర్యవేక్షకులు డి. రాధకృష్ణ, సి. మధుసూదన్రెడ్డి, ఇంఛార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు సుబ్బారెడ్డి, ఎడిటర్ డా. సి. అనిల్ కుమార్ సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.