* శ్రీశైల దేవస్థానం:మరమ్మతుల సమయం లో ప్రాచీన నిర్మాణాలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఓ ఎం. శ్రీనివాసరావు సూచించారు. పరిపాలనాంశాల సమీక్షలో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి పలు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. దేవస్థానం లో ప్రస్తుతం జరుగుతున్న ఆయా పనులను గురించి ఇంజనీరింగ్ అధికారులు కార్యనిర్వహణాధికారి కి వివరించారు. అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టనున్న ఆయా పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఆలయప్రాంగణములోని బండపరుపునకు వెంటనే తగు మరమ్మతులను చేయాలన్నారు.ఆలయ ప్రాంగణములో అక్కమహాదేవి అలంకార మండప నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. జనవరిలో జరగనున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలోగా మండప నిర్మాణపు పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ మండపంలోని వేదికను కూడా ఆలయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా కళాత్మకంగా తీర్చిదిద్దాలన్నారు. అమ్మవారి ఆలయంలోని రుధిరగుండానికి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయాలన్నారు.మరమ్మతుల సమయములో ప్రాచీన నిర్మాణాలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగాన్ని సూచించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణములో ఉత్తరభాగాన చేపట్టిన సాలుమండపాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
తరువాత మల్లమ్మ మందిరం(మల్లమ్మ కన్నీరు), గోసంరక్షణశాలను ఈ ఓ పరిశీలించారు.
మల్లమ్మ మందిరం (మల్లమ్మకన్నీరు) క్యూలైన్లలోని బండపరుపునకు తగు మరమ్మతులు చేయాలన్నారు. అదేవిధంగా మల్లమ్మ మందిరంలోని ఉద్యానవనాన్ని మరింతగా సుందరీకరించాలన్నారు.
గోసంరక్షణశాల పరిశీలన సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ శుచీశుభ్రతకు అధికప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనివలన పవిత్ర వాతావరణం నెలకొంటుందన్నారు. గోశాల నిర్వహణకు సంబంధించి పశుసంవర్థకశాఖ అధికారులు, నిపుణుల సలహాలను కూడా పొందాలని గోసంరక్షణ విభాగ సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా పశువైద్యనిపుణుల సలహాలను కూడా తీసుకోవాలన్నారు. గోసంరక్షణశాలలోని గోవులన్నింటికి శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికమైన ఆహారాన్ని అందించాలన్నారు.
ఈ పరిశీలనలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.