
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (15.08.2021) న 75వ స్వాతంత్ర్య దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ ,తరువాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పమాలను అర్పించారు.
అనంతరం దేవస్థానం భద్రతా సిబ్బంది, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోమ్ గార్డ్స్ సిబ్బంది పతాక వందనం చేశారు. ఆ తరువాత కార్యనిర్వహణాధికారి కే ఎస్.రామరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతం ఆలాపించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి కే ఎస్.రామరావు ప్రసంగిస్తూ గత సంవత్సర కాలంలో దేవస్థానం సాధించిన ప్రగతిని వివరించారు.
శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధికి దేవస్థానం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకు దేవదాయశాఖ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.వాణీమోహన్ మార్గదర్శకత్వం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ పూర్తి సహాయసహకారాలను అందిస్తున్నారన్నారు.ఈ సందర్భంగా దేవస్థానం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం, భక్తులకు సౌకర్యాల కల్పన, క్షేత్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహంతో దేవస్థానం ముందుకెళ్తుందన్నారు.ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మరోవైపు శ్రీశైలక్షేత్రాన్ని మరింత అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు .
శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తుల కోసం శ్రీశైలపరోక్షసేవను ప్రారంభించామని, ఆలయం లో జరిగే మొత్తం 10 ప్రధాన సేవలను పరోక్షంగా జరిపించుకునే అవకాశం కల్పించామన్నారు. ఆర్జిత పరోక్షసేవగా లక్షకుంకుమార్చన, బయలువీరభద్రస్వామివారికి విశేష అభిషేకం. నందీశ్వర స్వామివారికి విశేష అభిషేకాలను కూడా ప్రవేశపెట్టామన్నారు. ఈ పరోక్షసేవలకు భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. మనరాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పరోక్షసేవను జరిపించుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు 33, 105 మంది భక్తులు పరోక్షసేవను జరిపించుకున్నారు.
దేవస్థాన పరిధిలో కోవిడ్ నియంత్రణ చర్యలను దేవస్థానం ఎంతో పకడ్బందీగా అమలు చేసామని ఈ ఓ తెలిపారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా సమర్థవంతంగా చేపట్టామన్నారు. ఇందుకు సహకరించిన జిల్లా అధికారులకు, స్థానిక వైద్య ,పోలీస్ అధికారులకు దేవస్థానం తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.క్షేత్రపరిధిలోని ప్రాచీన కట్టడాలు వారసత్వ పరిరక్షణ పట్ల దేవస్థానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. పంచమఠాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసామని, ఘంటామఠ పునర్నిర్మాణములో 53 పురాతన శాసనాలు లభించాయన్నారు. ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా, మైసూరు విభాగపు సహకారం తో ఈ శాసనాల పాఠాలను, సారంశాన్ని విశ్లేషించే కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలో వీటిని గ్రంథరూపం లో తీసుకువస్తామన్నారు.
అభివృద్ధిలో భాగంగా, భక్తుల సౌకర్యార్థం పలు వినూత్న కార్యక్రమాలు కూడా చేపట్టామని ఈ ఓ వివరించారు.
శ్రీశైల మహాక్షేత్ర వైభవాన్ని అనేక పురాణాలు విశేషంగా ప్రస్తావించినప్పటికీ, క్షేత్రవైభవాన్ని స్కాంద పురాణములోని శ్రీశైలఖండం సంపూర్ణంగా ఆవిష్కరించిందన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ శ్రీశైలఖండం ప్రసిద్ధ గ్రంథాలయాలలో తాళపత్రాలుగా, పురాతన వ్రాతప్రతులకు మాత్రమే పరిమితమైందన్నారు. ఈ విశిష్ఠ గ్రంథాన్ని ప్రచురించడానికి సంకల్పించి ఎందరో సంస్కృత పండితుల సహకారం తో వివిధ తాళపత్ర గ్రంథాలను, వ్రాతప్రతులను సంపాదించి గ్రంథ పరిష్కరణ పద్ధతిలో మూలగ్రంథాన్ని రూపొందిన్చామన్నారు.
శ్రీశైలఖండం వ్రాతప్రతులను సేకరించడం, గ్రంథాన్ని పరిష్కరించడంలో ముఖ్యపాత్రను పోషించడమేకాకుండా శ్లోకాలకు భావాలను రూపొందించిన ప్రముఖ సంస్కృత పండితులు సీతారాంజనేయశర్మ, భీమవరం వారికి కార్యనిర్వహణాధికారి తమ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం శ్రీశైలఖండ ఆంగ్ల, కన్నడ భాషలోకి అనువదించే కార్యక్రమం చేపట్టామని, త్వరలో వీటిని కూడా పూర్తి చేస్తామన్నారు.