
శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది.
కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహా గణపతి పూజ జరిపారు. తరువాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పమాల అర్పించారు.
అనంతరం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, పతాక వందనం చేశారు. తరువాత కార్యనిర్వహణాధికారి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం జాతీయగీతం ఆలపించారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి ప్రసంగిస్తూ ఎందరో దేశభక్తుల, స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమ ఘట్టాలను వివరించారు.
గత సంవత్సర కాలములో దేవస్థానం సాధించిన ప్రగతిని ఈ ఓ వివరించారు. క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోందని, భక్తులరద్దీ కనుగుణంగా ఆయా సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందన్నారు. భక్తులరద్దీకనుగుణంగా ఆయా సౌకర్యాల కల్పనకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు . ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, క్షేత్రాన్ని అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రాభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. సిబ్బంది అందరు కూడా క్షేత్రాభివృద్ధిలో తమవంతు పాత్రను పోషించాలన్నారు.
దేవస్థానంలోని ఆయా విభాగాలు సాధించిన ప్రగతిని కూడా ఈ ఓ వివరించారు. పతావిష్కరణ తరువాత శ్రీ సాయిలిక్షితశ్రీ, లిక్షితా శ్రీ నృత్య కళాశాల, నందికొట్కూరు వారు దేశభక్తి గేయాలకు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.