టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచాలి
తిరుపతి 3 ఆగస్టు 2021: టీటీడీ నిర్వహణ లోని ఆస్పత్రులన్నింటికీ అవసరమయ్యే మందులు, వైద్య పరికరాలు కేంద్రీకృత కొనుగోలు విభాగం నుంచి కొనుగోలు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచడంతో పాటు వాటిని ప్రోత్సహించాలన్నారు.
తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సాయంత్రం ఆయన మందులు, వైద్య పరికరాల కొనుగోలు విధానం పై సమీక్ష నిర్వహించారు.స్విమ్స్ లో మందులు, పరికరాల కొనుగోలు కోసం టెండర్లు నిర్వహిస్తున్న విధానం తెలుసుకున్నారు. టెండర్ కాల పరిమితి పూర్తి కావడానికి నాలుగు నెలల ముందు నుంచే మళ్లీ టెండర్లు ఆహ్వానించే కసరత్తు ప్రారంభించాలన్నారు. ఏమందులు కావాలో ప్రతిపాదనలు పంపే అధికారులు వాటి నాణ్యత నిర్ధారించే కమిటీలో ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం నుంచి ఈ కమిటీలో ఒకరిని ఏర్పాటు చేసుకోవాలని ఈవో సూచించారు. రెండేళ్లకు సరిపడే మందులు ఒకే సారి కొనుగోలు చేసుకుకోవాలని ఇందుకోసం నిమ్స్, నింహ్యాన్స్ ఆసుపత్రులు అవలంభిస్తున్న విధానం అమలు చేసుకోవాలని ఈవో చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ లో మందులు ఏ ధరకు సరఫరా చేసున్నారో కూడా తెలుసుకోవాలని అన్నారు.
అదనపు ఈవో ధర్మారెడ్డి,జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, బర్ద్ ఆర్ఎమ్ఓ శేష శైలేంద్ర, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, స్విమ్స్ కొనుగోలు విభాగం అధికారులు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ ఎర్రమ రెడ్డి పాల్గొన్నారు.
*శ్రీవాణి ట్రస్ట్ ఆలయాలకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ విభాగం
– పనులు నిర్ణీత సమయంలో పూర్తి కావాలి
టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
తిరుమల 3 ఆగస్టు 2021: శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలపై తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ సహాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ముందే ఆలయం స్థల పురాణం, ప్రాశస్త్యం, ఇప్పటిదాకా పూజలు జరుగుతున్నాయా అనే అంశాలు పరిశీలించాలని చెప్పారు. ట్రస్ట్ నిధులతో ఆలయం పునరుద్ధరణ, లేదా అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల భక్తులకు ఎంత మేరకు ఉపయోగం ఉంటుందనే విషయం కూడా తెలుసుకోవాలని ఈవో చెప్పారు. ప్రతిపాదన నుంచి పని పూర్తి చేసే వరకు వ్యవధి నిర్ణయించుకోవాలన్నారు. టీటీడీ అనుబంధ, విలీన ఆలయాల్లో మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపట్టేలా శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఈ ఆలయాల్లో నీటి సరఫరా,ఇతర మౌళిక సదుపాయాలు, అప్రోచ్ రోడ్లు నిర్మాణం పనులు కూడా చేపట్టాలన్నారు. పురాతన ఆలయాల మరమ్మతుల సమయంలో నిర్మాణం డిజైన్ దెబ్బ తినకుండా చూడాలని చెప్పారు. తిరుమలలో రోడ్లు, ఫుట్ పాత్ నిర్వహణ చక్కగా ఉండాలని, సంబంధిత అధికారులు వారానికోసారి స్వయంగా వీటిని చూడాలని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నుంచి పలు ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అనుమతి మంజూరు చేశారు.
అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటి ఈవో రమణ ప్రసాద్ ఈ సమీక్ష లో పాల్గొన్నారు.
Post Comment