చిన్న పాలనా విభాగాలే మంచి ఫలితాలిస్తాయని ప్రపంచవ్యాప్తంగా గతానుభవాలు సూచిస్తున్నాయని, అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సత్వర అభివృద్ధికి, స్థానిక వనరుల సద్వినియోగానికి, పేదరిక నిర్మూలనకు చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ జిల్లాలో మంత్రి, కలెక్టర్లు తమ కంప్యూటర్లో కుటుంబాల వివరాలు నమోదు చేసుకుని స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే పరిస్థితి రావాలని చెప్పారు. అందుకే ప్రతీ జిల్లాలో సగటున 3లక్షల కుటుంబాలుండేలా జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, పర్యవేక్షణ లోపం వల్ల అవి అనుకున్న మేర ఫలితాలివ్వడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంత వరకు అశాంతి, అలజడి ఉంటుందన్నారు. వీటిని రూపమాపడంలో చిన్న పరిపాలనా విభాగాలు మంచి ఫలితాలు అందిస్తాయని, అందుకు మండల వ్యవస్థే ఉదాహరణ అని సిఎం అన్నారు. ప్రజల సౌకర్యార్ధమే ఈ ప్రక్రియ చేపట్టినందున జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా ఫరవాలేదని సిఎం అన్నారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సోమవారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి చర్చించారు. పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావుతో పాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో, రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. వేల కోట్లు ఖర్చుచేశారు. కానీ పేదరికం పోలేదు. దళితులు బాగుపడలేదు. వ్యవస్థలో మార్పు రాలేదు. పేదలు పేదలుగానే ఉన్నారు. అందుకే పాలకులకు కూడా తృప్తి లేదు. వెలితి అలాగే ఉంటున్నది. ఈ పరిస్థితి నుంచి బయటపడే చక్కని అవకాశం తెలంగాణ రాష్ట్రానికున్నది. తెలంగాణ రాష్ట్రానికి మంచి ఆదాయ వనరులున్నాయి. సానుకూల పరిస్థితులున్నాయి. వీటిని తెలివిగా ఉపయోగించుకుని పేదరికంపై యుద్దం చేయాలి, రాష్ట్రం నుంచి పేదరికాన్ని తరిమికొట్టాలి. పేదల కుటుంబాలను తట్టి లేపాలి. 2022 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. అప్పటికి తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయి. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం, మిషన్ భగీరథ, రహదారుల నిర్మాణం లాంటి భారీ పెట్టుబడులతో చేసే పనుల పూర్తవుతాయి. మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి లాంటి కొన్ని పనులు మాత్రమే ఉంటాయి. అప్పుడు మన చేతిలో చాలా డబ్బుంటుంది. ఆ డబ్బులన్నీ పేదరిక నిర్మూలన కోసమే వినియోగిస్తాం. ప్రతీ కుటుంబంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతీ కుటుంబం స్టేటస్ ఆయా జిల్లాల మంత్రి, కలెక్టర్ కంప్యూటర్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారు. ప్రతీ ఒక్క కుటుంబంపై దృష్టి పెట్టి వారి ఎదుగుదలకు కార్యాచరణ రూపొందిస్తారు. తెలంగాణకు వచ్చిన ఆదాయం పేదరిక నిర్మూలనకే కేటాయిస్తాం’’ అని ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులతో అన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిచే కార్యక్రమంపై దృష్టి పెట్టాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ చేపట్టినం. ఈ సారి కురిసిన వర్షాల వల్ల చెరువుల అలల మీద మన బతుకమ్మలు ఆడుతున్నయ్. ప్రజలంతా సంబురంగా ఉన్నారు. 2017 డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది. మేడిగడ్డ బ్యారేజితో పాటు మల్లన్నసాగర్, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లు పూర్తవుతాయి. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండి కాళేశ్వరం ప్రాజెక్టుతో కనెక్టు అవుతాయి. దేవాదులకు నీరిచ్చే తుపాకుల గూడెం కూడా పూర్తవుతుంది. శ్రీ సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. వీటన్నింటి ద్వారా గోదావరి నీళ్లు మన పొలాల్లో పారుతాయి. అటు కృష్ణా నీళ్లను ఉపయోగించుకోవడానికి పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తవుతాయి. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాదికే పూర్తవుతాయి. వీటి ద్వారా తెలంగాణ అంతా సస్యశ్యామలం అవుతుంది. విద్యుత్ రంగంలో కూడా ఎంతో పురోగతి సాధించుకున్నాం. త్వరలోనే మన రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుంద. ఇప్పటికే నిరంతర విద్యుత్ అందించుకుంటున్నాం. ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందుతాయి. రహదారుల పరిస్థితి ఎంతో మెరుగవుతుంది. మనం తీసుకొచ్చిన టిఎస్-ఐపాస్, ఐటి విధానాల వల్ల ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మిగిలేది పేదరిక నిర్మూలనే. వ్యవసాయం, నీటి పారుదల, అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగంలో వచ్చే మూడు నాలుగేళ్లలోనే మన రాష్ట్రం ఎంతో ముందుకుపోతుంది. ఇక మిగిలేది సంక్షేమమే. పేదరిక నిర్మూలనపైనే దృష్టి పెడతాం. ఇప్పటికే కెజి టు పిజి విద్యావిధానం అమలులో భాగంగా రెసిడెన్షయల్ స్కూల్స్ ప్రారంభించుకున్నాం. వచ్చే ఏడాదికి వాటి సంఖ్య పెంచుకుంటాం. పేద పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగుతెస్తాం. ఇంకా పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. వీటి పర్యవేక్షణకు చిన్న పరిపాలనా విభాగాలుండడం అత్యంత అవసరం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘మండలాలు ఏర్పాటు చేసినప్పుడు రాజకీయ జోక్యం ఎక్కువైంది. నాయకులు తమ స్వార్థం మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. మండలాల కూర్పు కూడా ప్రజల అభీష్టం మేరకు జరగలేదు. అర్హతలున్నా కొన్ని మండల కేంద్రాలు కాలేకపోయాయి. ఇప్పుడలా జరగవద్దు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జరగాలి. గతంలో జరిగిన పొరపాట్లను సవరించాలి. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉన్నా, వేరే జిల్లాలో ఉన్నా సరే వాటిని సమీప మండలంలో కలపాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు
——————————————-
ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా ప్రకారం 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభతరం అవుతుందని ప్రభుత్వం విధాన పర నిర్ణయం తీసుకున్నందున జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా అభ్యంతరం లేదని సిఎం స్పష్టం చేశారు. దసరా రోజు ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటుంటే జనగామ, సిరిసిల్ల, గద్వాల ప్రాంతాల ప్రజలు బాధలో ఉండడం మంచిది కాదని సిఎం అభిప్రాయపడ్డారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎంపి కె. కేశవరావు నాయకత్వంలో హైపర్ కమిటీ వేసి అధ్యయనం చేస్తామని, రెండు మూడు రోజుల్లోనే నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మూడు జిల్లాలను ఏఏ మండలాలతో కలిపి ఏర్పాటు చేయవచ్చో పరిశీలించాలని కూడా అధికారులను ఆదేశించారు.
మొదటి, రెండవ రోజు చర్చల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమయింది. దీని ప్రకారం వరంగల్ జిల్లాలో 5, కరీంనగర్ జిల్లాలో 4, మహబూబ్ నగర్ జిల్లాలో 4, మెదక్ లో 3, రంగారెడ్డిలో 3, నల్లగొండలో 3, ఆదిలాబాద్ లో 3, నిజామాబాద్ లో 2, ఖమ్మంలో 2, హైదరాబాద్ లో 1 చొప్పున జిల్లాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో 30 జిల్లాలు ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనే పేరు పెట్టాలని, వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లా పేరును వికారాబాద్ గానే ఉంచాలని, మహబూబాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు మహబూబాబాద్ పేరునే ఉంచాలని నిర్ణయించారు. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు ఏర్పాటు అయ్యే విషయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రతిపాదించిన కరీంనగర్, జగిత్యాలతో పాటు సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని, కమలాపూర్, ఎల్కతుర్తి, బీమదేవపూర్ మండలాలను వరంగల్ అర్బన్ జిల్లాలో, హుస్నాబాద్, కోహెడ్ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. మంథని రెవెన్యూ డివిజన్ ను యధావిధిగా కొనసాగించాలని, పెద్దపల్లిని నగర పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని, ఖమ్మం జల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని, వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని, కరీంనగర్ జిల్లాలో కొత్తగా రుద్రంగి మండలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఆరు మండలాలు (ఆళ్లపల్లి, కరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మిందేవిపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డి) ఏర్పుటు చేసే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ప్రతిపాదిత జనగామ జిల్లాలో కొత్తగా స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూపాలపల్లి జిల్లాలోని ములుగుకున్న ప్రాధాన్యం, గిరిజన జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వరంగల్ రూరల్ జిల్లా రాజధానిని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని సిఎం అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, సిరికొండ మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.