శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ఆదివారం నుంచి ఏడు రోజుల పాటు ప్రత్యేకంగా హోమాలను ప్రారంభించింది. విశ్వ కళ్యాణం కోసం, కరోనా వ్యాప్తి కట్టడికి , అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఈ హోమాలను ప్రారంభించింది.
ఇందులో మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం, శీతల హోమాలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం ఉదయం స్వామివారి యాగశాలలో మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమాలు చేసారు.సాయంత్రం అమ్మవారి యాగశాలలో శీతలహోమం ప్రత్యేకం.
సంకల్పం:
హోమ కార్యక్రమం లో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు, స్థానాచార్యులు సంకల్పాన్ని పఠించారు. రోగాలకు గురికాకుండా ఆరోగ్యంగా వుండాలని, ఆరోగ్యానికి హానికలిగించే కరోనా వైరస్ మొదలైన సూక్ష్మాంగజీవులు వ్యాప్తి చెందకుండా నశించాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలగాలని వేదపండితులు, అర్చకులు సంకల్పాన్ని పఠించారు.
గణపతిపూజ:
సంకల్ప పఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ చేసారు.
చండీశ్వరపూజ:
గణపతి పూజ తరువాత యాగశాలలో వేంచేబు చేయించిన చండీశ్వరస్వామివారికి, స్వామివార్ల ఉత్సవమూర్తులకు పూజాదికాలు జరిగాయి.
హోమాలు :
పూజాదికాల తరువాత మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, ఆయుష్యహోమ కార్యక్రమాలను చేసారు.