
శ్రీశైల దేవస్థానం:హనుమజ్జయంతిని పురస్కరించుకుని శనివారం శ్రీ ఆంజనేయస్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.శ్రీశైలంలోని పాతాళగంగమార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరిపారు.
లోక కల్యాణం కోసం జరిపిన ఈ విశేషపూజలలో భాగంగా ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలలో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని అర్చకులు సంకల్పాన్ని చెప్పారు.తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపారు.అనంతరం ఆంజనేయస్వామి వారికి ఆయా సూక్తాలతో పంచామృతాభిషేకం, జలాభిషేకం జరిపారు.తరువాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తరపూజ, నాగవల్లిదళపూజ (ఆకుపూజ), వడమాల సమర్పణ, పుష్పార్చన జరిపారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, సంబంధిత అధికారులు, అర్చకస్వాములు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.