శ్రీశైల దేవస్థానం: ఈ ఓ ఎస్.లవన్న ప్రత్యేక పర్యవేక్షణలో శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం మూడో రోజున శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిపారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్వహించారు. ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు,జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.అర్చక స్వాములు ,పండితులు పాల్గొన్నారు.
హంస వాహనసేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ ఘనంగా జరిగింది.
ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంస వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. కోలాటం, చెక్కభజన,రాజబటులవేషాలు, జాంజ్ పథక్,జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, చితడలు, శంఖం, పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసారు. వివిధ కళా వేదికలపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.