హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2023 అక్టోబరు 16: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
కాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి.
.
Post Comment