×

చేనేతకు చేయూత నేతన్నకు బాసట-సంక్షేమ పథకాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు

చేనేతకు చేయూత నేతన్నకు బాసట-సంక్షేమ పథకాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు

–   తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు

–   రైతు బీమా తరహాలో నేతన్న బీమా

–   సంక్షేమ పథకాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు

–   చేనేత కళాకారులకు అవార్డులు

–   తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు

రాష్ట్రాంలోని నేత కార్మికులకు ప్రభుత్వం చేయూత అందిస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ఒకప్పుడు సిరిసిల్లా, ఇతర ప్రదేశాల పేర్లు నిత్యం వార్తల్లో ఉండేవి.  అక్కడ ఎవరో ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకొన్న దృశ్యాలుండేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆత్మహత్యలు ఆగిపోయాయి. అందుకు ముఖ్య కారణం నేత కార్మికుల వెంట నేనున్నాననే భరోసా ప్రభుత్వం కల్పించటం కారణమని అధికారిక ఆనందం వ్యక్త మవుతోంది.

తెలంగాణ ఏర్పడిన అనంతరం  రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు  చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యత గుర్తించి ఆదరించటంతో పాటు ప్రోత్సహించారు. అంతేకాకుండా నేతన్నకు గౌరవప్రదమైన వేతనాన్ని పొందే  చర్యలు ప్రభుత్వం  తీసుకుంది. రాష్ట్ర చేనేత, జౌళి, ఐ.టి. పరిశ్రమలు, మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు  కె.తారక రామారావు చేనేతకు చేయూతలో భాగంగా ప్రతి సోమవారం ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అందరూ విధిగా చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చిన సంగతి విదితమే.

చేనేత మిత్ర పథకం క్రింద చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్, చేనేత సంఘాలు, టెస్కో కొనుగోలు చేసే నూలు, రంగులు, రసాయనాలపై 40 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు అకౌంటుకు జమ చేస్తోంది. ఇంతవరకు 20 వేల 501 మంది లబ్దిదారులకు 24.09 కోట్ల రూ.ల సబ్సిడీని అందించింది.

తెలంగాణ చేనేత వీవర్స్ పొదుపు నిధి, పొదుపు, భద్రతా పథకం (TFSSS) లో భాగంగా లబ్దిదారుని వాటా అయిన 8 శాతంను యథావిధిగా ఉంచి, ప్రభుత్వం ఇచ్చే వాటాను 8 నుండి 16 శాతంకు పెంచింది. ఈ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కాలపరిమితి 36 నెలలు. ఈ కాలపరిమితి పూర్తిగా లాకింగ్ పీరియడ్ తో కూడుకొన్నది. 2017 – 2020  లో 20 వేల 537  మంది లబ్దిదారులకు 96.43 కోట్ల రూ. అందిచటం జరిగింది. ప్రభుత్వం ఈ పథకాన్ని మరో మూడు సంవత్సరాలు కొనసాగించాలని నిర్ణయించి 30 కోట్ల రూ.లు విడుదల చేసింది.  ఈ విడతలో ఈ పథకం క్రింద 32 వేల 328 మంది లబ్దిదారులకు 25.31 కోట్ల రూ.లు వారి ఆర్.డి.ఖాతాలో జమ చేసారు.

చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాలకు వారి మరణాంతరం  ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం నేతన్న బీమా పథకం  ప్రారంభించింది. రైతు బీమా తరహాలో ఈ పథకం  కూడా జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి.) ద్వారా అమలు చేస్తారు. జీవిత బీమా సంస్థకు లబ్దిదారుల సంవత్సరం ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం లో లబ్ది కి  దరఖాస్తుదారుడు జియో టాగింగ్ జరిగిన మరమగ్గాలపై నేత కార్మికుడు అయి ఉండాలి లేదా అనుబంధ కార్మికుడై ఉండాలి. వయస్సు 18 నుండి 59 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి.

ఈ పథకం బీమా కాలంలో (ఇన్ష్యూర్డ్ పీరియడ్) లబ్దిదారుడు మరణిస్తే  వారి నామినీ ఖాతాకు 5 లక్షల రూ.లు డిపాజిట్ చేస్తారు. 10 పని రోజులలో ఈ మొత్తం నామినీకి అందేలా జమ చేస్తారు. ఈ పథకాన్ని రాష్ట్ర చేనేత, జౌళి, ఐ.టి. పరిశ్రమలు, మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు  కె.తారక రామారావు ఆగస్టు 7, 2022 ప్రారంభించారు. కాగా ఆగస్టు 14,2022  నుండి అమలు జరుగుతోంది.

పావలా వడ్డీ క్రింద 2022-23 లో 2.33 కోట్ల రూ.లు చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం విడుదల చేసింది.  20 శాతం యార్న్ సబ్సిడీ పథకం క్రింద 3.22 కోట్ల రూ.లు, మార్కెటింగ్ ప్రోత్సాహకాల క్రింద 6.02 కోట్ల రూ.లు సంఘాలకు విడుదల చేసారు.

చేనేత అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేసేందుకు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రాల అధికారుల బృందాలు మన రాష్ట్రాన్ని సందర్శించాయి. పథకాల అమలు తీరును అభినందించాయి.

చేనేత కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకుగాను ప్రభుత్వం ప్రతి ఏటా  కొండా లక్ష్మణ్ బాపూజీ  పేరు మీద అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు క్రింద ఇచ్చే నగదును 2020  నుండి 25 వేల రూ.లకు పెంచారు. తెలంగాణ సాంప్రదాయ, సమకాళీన  చేనేత కళాకృతులను ప్రదర్శించడానికి ప్రతి ఏటా ఫ్యాషన్ షో నిర్వహించి ప్రాచుర్యం కల్పిస్తోంది.

క్లిష్టమైన, శ్రమతో కూడిన డబుల్  ఇక్కత్  వీవ్స్ తో తేలియా రుమాల్ నేత, హిమ్రూ వీవ్స్, ఆర్మూర్ పట్టు చీరలు, పీతాంబరి పట్టు, జరీ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరల వంటి సుప్రసిద్దమైన చేనేత కళాకృతులను ఆధునిక టెక్నిక్స్ జోడించి అభివృద్ధి చేయడానికి, కొత్త డిజైన్లు, కొత్త వస్త్రాల రూపాలను తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధి ( ఆర్.డి.) విభాగాన్ని ఏర్పాటు చేసి, నిధులను సమకూర్చుతోంది.

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు, విద్యాలయాలకు టెస్కో (తెలంగాణ స్టేట్ హ్యాండ్ లూం వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్-టి.ఎస్.సి.ఓ) యూనిఫాం, ఇతర అవసరాలకు వినియోగించే వివిధ రకాల బట్టలను సరఫరా చేస్తుంది. సమగ్ర శిక్ష, ఎస్సీ, బి.సి., గిరిజన సంక్షేమ విద్యాలయాలు, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బి.సి. సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాల సంస్థలకు అవసరమయ్యే యూనిఫాం  బట్ట, ఇతర అవసరాల బట్టలను అందిస్తోంది. కేసిఆర్ కిట్స్, రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్స్, క్రిస్మస్  గిఫ్ట్ ప్యాకెట్స్, అంగన్వాడీ చీరలు, ఆశా వర్కర్స్ చీరలు కూడా టెస్కో సరఫరా చేస్తోంది.

బతుకమ్మ చీరలు

తెలంగాణ ఆడపడుచులు ఆనందంగా జరుపుకొనే బతుకమ్మ పండుగను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా (రాష్ట్ర పండుగ) ప్రకటించింది. అందులో భాగంగా ఆహార భద్రత కార్డులలో నమోదై ఉన్న 18 సంవత్సరాలు పై బడిన మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. 2017 లో ప్రారంభించిన ఈ చీరల పథకం క్రింద బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడపడుచులు కొత్త చీరలు ధరించి బతుకమ్మ ఆడే సాంప్రదాయానికి ఊతం ఇచ్చింది. ఫలితంగా పవర్ లూం నేతన్నలకు ఏడాది పొడుగునా ఉపాధి లభించే అవకాశం దక్కింది. నేతన్నల వేతనాలు పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగైనాయి. బతుకమ్మ చీరల వివరాలు ఇవి.

వరుస సంఖ్య సంవత్సరం 2017 2018 2019 2020 2021
1 పంపిణీ చేసిన చీరలు 95,48,439 96,70,474 96,57,813 96,24,384 94,00,000
2 వ్యయం (రూ.కోట్లలో) 222.48 280.00 313.00 317.81 333.14
print

Post Comment

You May Have Missed