శ్రీశైల దేవస్థానం:ఈ నెల 27న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో సీతారామచంద్రస్వామివార్ల కల్యాణోత్సవం జరుగుతుంది.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం గం. 9.00ల నుండి సీతారాముల వారికి, ఆ తరువాత ఆంజనేయస్వామి వారికి విశేష పూజాదికాలు నిర్వహిస్తారు. తరువాత ఉదయం గం. 9.30 నుండి సీతారాముల కల్యాణోత్సవం వుంటుంది.
ఈ కల్యాణమహోత్సవంలో ముందుగా లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించి , కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేస్తారు.
అనంతరం వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవచనం, ఆ తరువాత కంకణపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతపూజ, యజ్ఞోపవీతధారణ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, గౌరీపూజ, మాంగల్య పూజ, శ్రీ సీతాదేవివారికి మాంగల్యధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సంప్రదాయ బద్దంగా సీతారామ కల్యాణం వుంటుంది. కల్యాణోత్సవం తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తారు
