శ్రీశైల దేవస్థానం:పర్యాటక , సాంస్కృతిక మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక , సాంస్కృతిక కమిషన్ వారిచే మంగళవారం నిత్య కళారాధన వేదిక వద్ద ‘కృష్ణవేణీ సంగీత నీరాజనోత్సవం నిర్వహించారు.
సంగీత నీరాజనోత్సవ కార్యక్రమం లో భాగంగా ఈ సాయంత్రం గం. 6.00ల నుంచి గం.7.00ల వరకు కర్ణాటక సంగీత గాత్రకచేరి జరిపారు.
ఈ కార్యక్రమం లో విదూషి అంజలి శ్రీరామ్, బెంగుళూరు వారు పలు కీర్తనలు ఆలాపించారు. గాత్ర కచేరికి విద్వాన్ అచ్యుతరావు వయోలీన్ సహకారాన్ని, విదూషి రంజని వెంకటేష్ మృదంగ సహకారాన్ని అందించారు.
కార్యక్రమానికి విచ్చేసిన దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ భారత ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖలు , రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైల దేవస్థానములో సంగీత నీరాజనోత్సవాన్ని జరిపించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. పేరొందిన కళాకారులచే నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతో రంజింపజేసిందన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ , రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు దేవస్థానం పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖల వారు , రాష్ట్రప్రభుత్వం వారు దేవస్థానంలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
కృష్ణవేణీ సంగీత నీరాజనోత్సవం డిసెంబరు 6 , 7వ తేదీలలో విజయవాడ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారన్నారు . ముందస్తుగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచల ఆలయాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించారన్నారు.
అనంతరం కృపాకర్ రావిపాటి, అసిస్టెంట్ డైరెక్టర్, ఇండియా టూరిజం, హైదరాబాద్, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ వారు మాట్లాడుతూ – భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ఆధ్యాత్మిక పర్యాటకంతో కళలను అనుసంధానించడమే ఈ ఉత్సవ లక్ష్యమని తెలిపారు. ఈ కర్ణాటక సంగీత గాత్రకచేరి భక్తులు, పర్యాటకులు , స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించిదన్నారు. శ్రీశైలానికి మరింత సాంస్కృతిక వైభవం దక్కిందన్నారు.
డిసెంబర్ 6 , 7 తేదీలలో విజయవాడలో జరగనున్న ప్రధాన సంగీత మహోత్సవానికి కళాభిమానులు, సంగీతప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై భారతీయ కర్ణాటక సంగీత సంపదను ఆస్వాదించాలని పర్యాటక మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC), డివిజనల్ మేనేజర్
లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో కళాకారులను . సంబంధిత అధికారులను దేవస్థానం పక్షాన వేదాశీర్వచనంతో సత్కరించి, ప్రసాదాలు , శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటాలను బహూకరించారు.
భారత ప్రభుత్వ అధికారులు కూడా ధర్మకర్తల మండలి అధ్యక్షులు,కార్యనిర్వహణాధికారిలను సత్కరించారు.
