
శ్రీశైల దేవస్థానం:
శ్రీశైల దేవస్థానం: ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవం:
ఈ రోజు రాత్రి గం.12.00 లకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం ప్రత్యేకం. ఈ కల్యాణోత్సవంలో స్వామివారు పట్టువస్త్రాన్ని ధరించి, తలపై ఒకవైపు గంగమ్మను, మరొకవైపు నెలవంకను, మెడలో రుద్రాక్షమాలను, నుదుట విభూతి రేఖలను, పట్టువస్త్రాలను ధరించి పెండ్లికుమారుడుగా ముస్తాబు ప్రత్యేకం.
అమ్మవారు కూడా పట్టువస్త్రాలను ధరించి, నుదుట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సర్వాభరణాలను ధరించి పెండ్లికుమార్తె అయి స్వామికి సరిజోడనిపించడం నయనానందకరం. మంగళ తూర్యనాదాలతో, వేదమంత్రాల నడుమ నేత్రానందంగా ఈ కల్యాణోత్సవం . అంతకు ముందు ఈ లీలా కల్యాణానికి కంకణాలను స్వామిఅమ్మవారి అభరణాలను, యజ్ఞోపవీతాన్ని, భాషికాలను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొని రావడం సంప్రదాయం.
ఈ కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ విశేషం. ఆ తరువాత వృద్ధి ,అభ్యుదయాల కోసం పుణ్యహవచనం సంప్రదాయం.తరువాత కంకణపూజ, యజ్ఞోపవీతపూజ చేసి స్వామివారికి కంకణధార, యజ్ఞోపవీతధారణ ఆనవాయితి. అనంతరం సప్త ఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను ఆ తరువాత స్వామివారికి వరపూజ విశేషం. అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠనం సంప్రదాయం.తరువాత స్వామివారికి మధుపర్కం సమర్పించి తరువాత భాషికధారణ కార్యక్రమం , ఆ తరువాత గౌరీపూజ విశేషం.
స్వామిఅమ్మవార్ల మధ్య తెర సెల్లను ఏర్పరచి మహాసంకల్ప పఠనం అనంతరం సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం, ఆ తరువాత మాంగల్యపూజను జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ ఆనందదాయకం. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనాన్ని అందజేయడం మహాశివరాత్రి రోజున మరపురాని ఘట్టం.కళ్యాణ ఘట్టం తెల్లవారు జామున దాదాపు ౩ గం.కు పూర్తి అయింది.
వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్:
శ్రీశైలం/నంద్యాల:
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి పాగాలంకరణ ఘనంగా ముగిసింది. శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలమహాక్షేత్రంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లింగోద్భవం సమయంలో చీరాల వాస్తవ్యులు పృధ్వి వెంకటేశ్వర్లు ఎంతో నిష్టతో భక్తిశ్రద్ధలతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున అమ్మ వార్లను తలుచుకుంటూ స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు. రోజుకు మూర చొప్పున నేత నేస్తూ 365 రోజులు పాటు తయారు చేసిన పాగాను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్రదాయబద్ధంగా పాగాను అలంకరించారు. ఈ పాగాలంకరణ ఘట్టం దాదాపు రెండు గంటలు పాటు జరిగింది. ఈ ఘట్టంలో భక్తులు శివనామస్మరణతో శ్రీశైల మహా పుణ్యక్షేత్రం మారుమోగింది.
అనంతరం రమణీయం… కమనీయం గా నయనానందకరంగా నాగలకట్ట సమీపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కల్యాణ తంతు వైభవోపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది. అశేష భక్త జనవాహిని మధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి.
ఈ ఉత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, శ్రీశైల దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న తదితరులు పాల్గొన్నారు.