
శ్రీశైల దేవస్థానం: బయలు వీరభద్రస్వామి పరోక్షసేవకు అనూహ్య స్పందన వచ్చిందని, సేవలో 711 మంది భక్తులు పాల్గొన్నారని దేవస్థానం ఈ ఓ కే ఎస్.రామరావు తెలిపారు. ఆర్టితపరోక్షసేవగా ఈ రోజు (08.08.2021) న శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేషార్చన జరిగింది.
మొత్తం 711 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుమును చెల్లించి ఈ పరోక్షసేవను జరిపించుకున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా మొదలైన ఇతర రాష్ట్రాల నుంచి , ప్రవాస భారతీయులు కూడా ఈ పూజలను జరిపించుకుంటున్నారు.
ఈ రోజు సాయంకాలం గం. 5.30 నుండి ఈ విశేషపూజ ప్రారంభమైంది. కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించ బడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి కే ఎస్.రామరావు మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రియల్ మాసములో ప్రారంభించిన పరోక్షసేవను దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రస్తుతం మరింతగా విస్తరింపజేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శ్రీశైలక్షేత్ర సంప్రదాయాలలో బయలు వీరభద్రస్వామివారికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. శ్రీశైలక్షేత్రానికి బయలు వీరభద్రస్వామివారే క్షేత్రపాలకుడని పేర్కొన్నారు.బయలువీరభద్రస్వామివారికి నిత్యపూజాదికాలతో పాటు లోకకల్యాణార్థం దేవస్థానం ప్రతి మంగళవారం, అమావాస్య రోజులలో విశేష పూజాదికాలను నిర్వహిస్తున్నదని అన్నారు.
ప్రస్తుతం అమావాస్య నాడు పూజలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. ప్రతీనెలలో కూడా అమావాస్యరోజున ప్రదోషకాలములో భక్తులు ఈ పూజాదికాలను పరోక్షసేవ ద్వారా భక్తులు జరిపించుకోవచ్చునని అన్నారు.
ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవారుసుమును www.srisalladevasthanam.org లేదా www.tms.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేయడం జరుగుతున్నది.సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి | యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/52/53/ 54/55/56 లను సంప్రదించవచ్చును.