శ్రీశైల దేవస్థానం:
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం 10.00గంటలకు ఆలయ ప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది.
జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పలువురు సిబ్బంది తదితరులు కార్యక్రమములో పాల్గొన్నారు.
దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత వీరభద్ర దైవజ్ఞ , రాజమండ్రి వారు పంచాంగ పఠనం చేసి పంచాంగ శ్రవణం చేయించారు.
పంచాంగ శ్రవణం కంటే ముందు లోక కల్యాణాన్నికాంక్షిస్తూ అర్చక స్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.
ఈ సంకల్పంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.
అనంతరం మహాగణపతిపూజ జరిపించారు. తరువాత లోకక్షేమం కోసం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలను నిర్వహించారు.
శ్రీస్వామిఅమ్మవార్ల పూజాదికాల తరువాత నూతన పంచాంగానికి కూడా పూజాదికాలు జరిపించారు.
అనంతరం జిల్లా కలెక్టర్, కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు ఆస్థాన సిద్దాంతి దైవజ్ఞ వారిని నూతన వస్త్రాలతో సత్కరించి, పంచాంగ పఠణానికై ఆహ్వానించారు.
తరువాత ఆస్థాన సిద్ధాంతి వారు శ్రీ పరాభవనామ సంవత్సర విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం మంచివర్షాలు కురుస్తాయన్నారు. దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రజలు సుఖంగా ఉంటారన్నారు.
అదేవిధంగా గోవులు అధిక క్షీరాన్ని ఇస్తాయన్నారు. వరి,గోధుమ, చెరుకు పంటలు బాగా పండి అధిక దిగుబడిని ఇస్తాయన్నారు. ఆహారధాన్యములు దేశంలో సమృద్ధిగా ఉంటాయన్నారు. మన సైన్యం యొక్క పాటవము వృద్ధిపొందుతుందన్నారు. తెలుపుధాన్యాలు బాగా పండుతాయన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు. మంచి ధరలు ఉండడం చేత రైతులకు మంచి లాభాలు కలుగుతాయన్నారు. పెసర పంట దిగుబడి బాగా ఉంటుందన్నారు. అన్ని పంటలకు మంచి ధరలు ఉంటాయన్నారు. అన్ని రకాల ధాన్యాలు విరివిగా పండుతాయన్నారు. కొన్నిచోట్ల ఉరుములు, వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన ప్రజారంజకంగా ఉంటుందన్నారు.
ఈ సంవత్సరం భారతదేశంలో ఎటువంటి గ్రహణములు కనపడవన్నారు.
ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తాయన్నారు.
పండిత సత్కారం;
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆలయ ప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో సంప్రదాయంగా పండిత సత్కార కార్యక్రమం జరిపించచారు.
ఈ సత్కార కార్యక్రమములో శ్రీస్వామివారి ప్రధానార్చకులు కె. శివప్రసాద్ స్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు కె. విజయకుమార్ స్వామి, వేదపండితులు కె. పృథ్వీ కుమార్ శర్మలకు నూతన వస్త్రం, నూతన పంచాంగం, కొబ్బరిబోండం, పలు రకాల పండ్లు మొదలైనవాటితో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేసి సంప్రదాయబద్ధంగా సత్కరించారు.
అదేవిధంగా పండిత సత్కార కార్యక్రమములో భాగంగా దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత వీరభద్ర దైవజ్ఞవారిని , తంత్రసముచ్ఛయమును ఆగమ గ్రంథమును తెలుగులిపిలో రూపొందించి దేవస్థానమునకు అందజేసిన శ్రిష్ఠి సీతారామాంజనేయశర్మ, భీమవరం వారిని కూడా సంప్రదాయబద్ధంగా సత్కరించారు
