
శ్రీశైల దేవస్థానం:కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో గోపూజను నిర్వహించింది.
ప్రతీనిత్యం ఆలయంలో ప్రాత:కాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ, కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిత్యసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపారు. శాస్త్రోక్తంగా ఈ గోపూజలో ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకులములో గోవులకు, గోవత్సాలకు (ఆవుదూడలకు) పూజాదికాలు జరిగాయి.
ఈ విశేష కార్యక్రమములో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు పూజాసంకల్పాన్ని పఠించారు.
ఈ సంకల్పములో సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు పండాలని అతివృష్టి,అనావృష్టి నివారించబడాలని, పాడిపంటలతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, అందరికి శ్రేయస్సు కలగాలని కోరారు.
ఆ తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకుగాను ముందుగా మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తరమంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిగాయి. చివరగా గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. తరువాత దేవస్థాన గో సంరక్షణశాలలో కూడా శ్రీకృష్ణుని పూజ, గో పూజ జరిగాయి.
మన వేదసంస్కృతిలో గోవుకు ఎంతో విశేషస్థానం ఉంది. మన వేదాలు ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు మొదలైనవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయి. గోవు సకల దేవతలకు ఆవాస స్థానం కావడం చేత గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గోపూజను ఆచరించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా జగన్మాత లలితాపరమేశ్వరి గోవురూపంలో భూమిపై సంచరిస్తుందని నమ్మకం.
కాగా తాను చేసిన ప్రతిపనిలోనూ వైశిష్ట్యాన్ని బోధించిన శ్రీ కృష్ణపరమాత్మ ఆవుల మంద అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన వ్రేపల్లెలో పెరిగి గోవులను కాసి, గోపాలునిగా పేరుగాంచి, గోవుయొక్క అనంత మహిమను లోకానికి తెలియజేశాడు. ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సంప్రదాయం అయింది.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, అర్చకస్వాములు, వేదపండితులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.