×

శ్రీశైల దేవస్థానం పథకాలకు మరింత ప్రచారాన్ని కల్పించాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం పథకాలకు మరింత ప్రచారాన్ని కల్పించాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:దేవస్థాన పరిపాలనా సంబంధిత  అంశాలపై  ఈ ఓ  లవన్న మంగళవారం   సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం  నిర్వహిస్తున్న వివిధ విరాళాల పథకాలు, దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భక్తులకు దర్శనం ఏర్పాట్లు, రద్దీ రోజులలో తీసుకోవలసిన ముందస్తు చర్యలు, ఇంజనీరింగ్ పనులు మొదలైన అంశాలు చర్చించారు. ఈ ఓ  మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి కూడా దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కుటీర నిర్మాణ పథకం, గో సంరక్షణ పథకం, అన్నప్రసాద వితరణ పథకం, ప్రాణదాన ట్రస్ట్ మొదలైన విరాళాల పథకాలను నిర్వహిస్తున్నదని, భక్తులు ఆయా పథకాలకు విరాళాలను సమర్పించేందుకు వీలుగా మరింత ప్రచారాన్ని కల్పించాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.

 ఆయా పథకాలకు విరాళాలను సమర్పించే దాతలకు మరింతగా కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి నివేదిక రూపొందించాలని ప్రజాసంబంధాలు,  ఆలయ విభాగాన్ని ఆదేశించారు.భక్తులు ఆయా ఆర్జితసేవలను జరిపించుకునేందుకు వీలుగా ఆర్జిత సేవా వివరాలను తెలియజేసే మరిన్ని బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్,  శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు పరోక్షంగా ఆయా ఆర్జిత సేవలను జరిపించుకునేందుకు వీలుగా పరోక్షసేవల గురించి మరింత ప్రచారం కల్పించాలని ప్రజాసంబంధాల విభాగాన్ని ఆదేశించారు.

ప్రతి మాసం లోనూ రద్దీ ఎక్కువగా ఉండే సెలవురోజులు, పర్వదినాలు మొదలైన వాటి వివరాలతో జాబితాను సిద్ధం చేయాలని ఆలయ,  ప్రజాసంబంధాల విభాగాన్ని ఆదేశించారు. ఈ విధంగా ముందస్తుగా జాబితాను రూపొందించడం వలన ఆయా రోజులలో భక్తుల రద్దీకనుగుణంగా ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు.ముఖ్యంగా భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్ల లో  వేచివుండకుండా  తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.

ఈ ఓ ఇంజనీరింగ్ పనుల గురించి సమీక్షించారు. ఇటీవల పూర్తి అయిన  ఇంజనీరింగ్ పనులు, ప్రస్తుతం జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, సమీప భవిష్యత్తులో చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఇంజనీరింగ్ పనులలో పూర్తి నాణ్యతను పాటించాలన్నారు.  సకాలంలో ఆయా పనులను పూర్తి చేయాలన్నారు.దేవస్థానం భవనాలు, క్యూకాంప్లెక్స్ మొదలైనవాటి సంబంధించి చిన్న చిన్న మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. ముఖ్యంగా అన్ని భవనాలకు కూడా ఎలక్ట్రికల్ వైరింగులను పరిశీలించి అవసరమైనచోట్ల తగు మరమ్మతులు చేయాలన్నారు.

క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనం పెంపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్,  ఉద్యానవన విభాగాలను ఈ ఓ  ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో విస్తృతంగా మొక్కలు  నాటేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.

 సమావేశం లో గోశాల నిర్వహణ,దేవస్థానం చేపట్టిన భద్రతా చర్యలు మొదలైన అంశాలు కూడా చర్చించారు.

print

Post Comment

You May Have Missed