
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి సోమవారం పలు చోట్ల పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు ప్రసాద్ పథకం కింద గంగాసదన్ ఎదురుగా నిర్మించిన టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్ కు అవసరమైన ఫర్నీచర్ మొదలైన వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని చక్రపాణి రెడ్డి ఆదేశించారు. ఫెసిలిటేషన్ సెంటర్ ముందు భాగంలో సుందరీకరణ మొక్కలను ( క్రోటన్ మొక్కలను ) నాటాలన్నారు. వీలైన చోట్ల ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్ చేయాలని సూచించారు.తరువాత శిఖరేశ్వరం వద్ద, హాఠకేశ్వరం వద్ద నిర్మించిన టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లను కూడా పరిశీలించారు. వీటికి కూడా అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటుకు చర్యలను చేపట్టాలన్నారు. వీటి వద్ద కూడా సుందరీకరణ మొక్కలను నాటాలని ఆదేశించారు.
హాఠకేశ్వర ఆలయ సందర్శన:
పిలిగ్రీం ఫెసిలిటేషన్ సెంటర్ల పరిశీలన తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు హాఠకేశ్వర ఆలయాన్ని సందర్శించారు. పచ్చదననాన్ని పెంపొందించడంలో భాగంగా హఠకేశ్వర ఆలయప్రాంగణములో మరిన్ని పూలమొక్కలను పెంచాలని ఆయన ఆదేశించారు.హాఠకేశ్వర ఆలయ వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో కూడ పూల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టలన్నారు.
గోసంరక్షణశాల పరిశీలన:
ఈ సాయంకాలం ధర్మకర్తల మండలి అధ్యక్షులు గోసంరక్షణశాలను కూడా పరిశీలించారు. గోవులన్నింటికీ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ముందుజాగ్రత్తలో భాగంగా గోవులకు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటికి కాలానుగుణంగా టీకా మందులను వేయించాలని అధికారులకు సూచించారు. గోవు సంరక్షణకు అవసరమైన ఔషధాలన్నింటిని కూడా సిద్ధంగా వుంచుకోవాలన్నారు.తరువాత గో అర్క్ కేంద్రాన్ని పరిశీలించారు. విభూతి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆలయాన్ని సందర్శించే భక్తుల రద్దీకనుగుణంగా ఎప్పటికప్పుడు తగినంత విభూతి స్టాకును సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, నరసింహా రెడ్డి, శ్రీనివాసరెడ్డి,ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
గోశాల పరిశీలనలో పర్యవేక్షకులు కె.వెంకటేశ్వర రావు, గోశాల గుమస్తాలు ఎం.హరియ నాయక్ , జి. రవి తదితరులు పాల్గొన్నారు.